Kollu Ravindra | గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులపై ఆందోళన అవసరం లేదని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవస్థానం భూములపై వైసీపీ ఇటీవల దుష్ప్రచారానికి దిగిందని తెలిపారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఆస్తులను పరిరక్షిస్తూ ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గొల్లపూడి నేషనల్ హైవే పక్కన 40 ఎకరాల దేవస్థానం భూమిని రూ.5కోట్లతో విజయవాడ ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చిందని చెప్పారు. దేవస్థానం భూములు ఎవ్వరికీ బదలాయింపు జరగడం లేదని స్ఫష్టం చేశారు.
కేవలం విజయవాడ ఉత్సవ్ నిర్వహించడానికే 56 రోజుల పాటు లీజుకు ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. దీని ద్వారా 45 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు. కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులను కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానం భూములు అన్యాక్రాంతం కావని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ దేవస్థానానికి ఈ భూముల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.