Volunteer System | ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి స్పందించారు. శుక్రవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వాలంటీర్ల గౌరవ వేతనంపై కూడా ప్రతిపాదనలు వస్తున్నాయన్న విషయాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వెల్లడించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో విధివిధానాల రూపకల్పన చేస్తామని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? అని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చంద్రబాబు సహా టీడీపీ నేతలు వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు అయోమయంలో పడిపోయారు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో పింఛన్ల పంపిణీ విషయంలోనూ వాలంటీర్ల సేవలను వినియోగించలేదు. దీంతో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మంత్రి ఇచ్చిన సమాధానంతో 2 లక్షల మంది వాలంటీర్లలో నెలకొన్న ఆందోళనకు ఫుల్స్టాప్ పడింది.