AP News | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవస్థను ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా దశలవారీగా మంగళం పాడుతారా? అనే అనుమానం మొదలయ్యింది. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కనబెట్టి సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించడంతో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు.
వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్, సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పథకాలకు రూ.3,573.22 కోట్ల బకాయి ఉందని మంత్రి డోలా తెలిపారు. ఆ బకాయిల భారం మొత్తం తమ ప్రభుత్వంపైనే పడిందని చెప్పారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ నేతలు ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాదు వాలంటీర్లకు ఇస్తున్న జీతాన్ని కూడా రూ.5వేల నుంచి 10 వేలకు పెంచుతానని కూడా హామీ ఇచ్చారు. కానీ పింఛన్ల పంపిణీని వాలంటీర్ల నుంచి దూరం చేయడంతో ఈ వ్యవస్థ కొనసాగింపు అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది.