AP Liquor Policy | ఏపీలో నూతన మద్యం పాలసీ ఖరారైంది. రెండేళ్ల కాలపరిమితితో కొత్త పాలసీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉండనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 3396 మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం షాపుల గడువు సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమలులోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న మద్యం షాపులు యథాతథంగా కొనసాగనున్నాయి.
కొత్త మద్యం షాపుల కోసం నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి, లైసెన్సులను కేటాయిస్తారు. ఈ నెల 12 నుంచి లైసెన్స్‌దారులు కొత్త మద్యం షాపులను ప్రారంభించుకోవచ్చు.