శ్రీకాకుళం: కర్నూలు జిల్లా కలెక్టర్ ఇటీవల తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఐఏఎస్ తన కుమారుడిని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో జాయిన్ చేసింది. ఇలా ఐఏఎస్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తుండటంతో ప్రజలు వారిని అనుసరిస్తున్నారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కూడా కల్పిస్తుండటంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని పరిశీలకులు చెప్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్గా బీ నవ్య పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు శ్రీకర్ ప్రతీక్. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని మల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. ఏపీ సర్కార్ విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన వసతులు ఉన్నాయని ఐఏఎస్ అధికారిణి బీ నవ్య తెలిపారు. తాను కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లోనే చదువుకుని ఐఏఎస్ స్థాయికి ఎదిగానని చెప్పారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో అందుతున్న సదుపాయాలతో పాటు విద్యాబోధన సంతృప్తికరంగా ఉన్నందునే తన కుమారుడ్ని కర్నూలు బుధవారపేటలోని అంగన్వాడీ ప్రీ స్కూల్లో చేర్పించినట్లు కర్నూలు కలెక్టర్ కోటేశ్వర్రావు ఇటీవల మీడియాకు వెల్లడించారు. తాను స్వయంగా అంగన్వాడీ కేంద్రంలోని పరిస్థితులను సమీక్షించి సంతృప్తి చెందినట్లు ఆయన చెప్పారు. ఐఏఎస్ అధికారులు ఇద్దరూ తమ పిల్లల్ని ఇలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించడం పట్ల ఏపీ ప్రజలు అభినందిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా అధికారులు తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు.