అమరావతి: రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు పేరు పెట్టడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పలానా జిల్లాకు పలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిడం కోర్టు పని కాదని పేర్కొన్నది. ఏ పేరు పెట్టాలన్నది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని వ్యాఖ్యానించింది. ఒకవేళ అలాంటి ఆదేశాలివ్వాలంటే ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు, ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్ నిరూపించాల్సిన అవసరం ఉంటుందని తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లా పేరును మార్చి ఆ జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నంద్యాలకు చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు విచారణ పూర్తిచేసి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ పిల్‌ను కొట్టేసింది. జిల్లాకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఏవీ లేవని, అలా చట్టం కూడా ఏదీ లేదని కోర్టు తెలిపింది. జిల్లాకు పలానా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని, అది కోర్టు పని కాదని స్పష్టం చేసింది. ఏదైనా జిల్లాకు, పట్టణానికి రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఇతర ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది పూర్తిగా ప్రభుత్వం పరిధిలోనిదని పేర్కన్నది. ఈ పిల్‌పై వాదనలు ముగిసినందున పిల్ హైకోర్టు కొట్టేసింది.