NTR | ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు నందమూరి తారకరామరావు పేరును పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. లోక్‌సభలో శుక్రవారం ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు.
గన్నవరం విమానాశ్రాయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడంతో పాటు రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్టులకు పేర్లను సూచిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మురళీధర్ మొహోల్ వెల్లడించారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా పేరును ప్రతిపాదించింది. అలాగే ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సూచించిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపించాయని కేంద్రమంత్రి తెలిపారు. దర్బంగా ఎయిర్‌పోర్టును విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్ కోరిందని పేర్కొన్నారు. ఏపీ, బిహార్‌తోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలు కూడా ప్రతిపాదనలు పంపిన జాబితాలో ఉన్నాయని చెప్పారు.