AP News | నూతన బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్ ఫీజులను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. అలాగే లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నిర్ణయం దరఖాస్తుదారులకు ఆర్థికంగా లాభదాయకం కానుందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
కొత్త బార్ విధానంలో 50 వేల జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలకు రూ.75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. ఇది రిటైల్ ఏ4 దుకాణాలతో పోలిస్తే 26-48 శాతం తక్కువ అని నిశాంత్ కుమార్ తెలిపారు. అంటే.. తంలో బార్ లైసెన్స్ కోసం కడపలో రూ.1.97కోట్లు, అనంతపురంలో రూ.1.79కోట్లు, తిరుపతిలో ర.1.72కోట్లు, ఒంగోలులో రూ.1.40 కోట్లు ఉండగా.. కొత్త పాలసీ ప్రకారం రూ.55 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే దరఖాస్తు ఫీజును రూ.5లక్షల వరకు తగ్గించినట్లు నిశాంత్ కుమార్ తెలిపారు. పాత విధానంలో 90 శాతం పట్టణ స్థానిక సంస్థల్లోని బార్లకు రూ.5లక్షలకు మించి చెల్లించాల్సి వచ్చేది. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు నగరాల్లోని 362 బార్లకు గతంలో 10 లక్షల చొప్పున రుసుం ఉండేది. మదనపల్లె, చీరాల, బాపట్ల, ఒంగోలు వంటి మున్సిపాలిటీల్లోని 339 బార్లకు 7.5 లక్షల చొప్పున ఫీజు ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా దరఖాస్తు రుసుమును రూ.5 లక్షలుగా నిర్ణయించారు.