Pawan Kalyan OG | హరిహరవీరమల్లు డిసప్పాయింట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ చిత్రంపైనే ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ లుక్, క్యారెక్టరైజేషన్ అభిమానులకు ఎంతగానో నచ్చాయి. దీంతో ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్‌ను బద్ధలకొడుతుందని పక్కాగా చెబుతున్నారు. అందుకే ఈ నెల 25నవిడుదల అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోకు అనుమతినిచ్చింది. అలాగే కొన్ని రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ మెమో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం.. ఈ నెల 25న తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.వెయ్యిగా నిర్ణయించింది. సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ 4 వరకు అంటే పది రోజుల పాటు టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్‌లో రూ.125 (జీఎస్టీ కలిపి), మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ కలిపి) వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.