AP CM’s brother : ఏపీ సీఎం (AP CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఇంట విషాదం నెలకొంది. చంద్రబాబు సోదరుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే (TDP former MLA) నారా రామ్మూర్తి నాయుడు (Nara Rammurthy Naidu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ (శనివారం) ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు తన సోదరుడి మరణవార్త తెలియగానే పర్యటనను రద్దు చేసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం ఉదయం స్వగ్రామం నారావారిపల్లెలోనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా రామ్మూర్తి నాయుడు గతంలో 1994 నుంచి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి చేతిలో ఓటమిపాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన మొదటి నుంచి తిరుపతిలో ఎక్కువగా ఉండటంతో పార్టీలో పెద్దగా పాపులర్ కాలేకపోయారు.
కాగా నారా రామ్ముర్తి నాయుడు కుమారుడే సినిమా నటుడు నారా రోహిత్. నారా రోహిత్ ఇప్పటికే హీరోగా పలు సినిమాల్లో నటించాడు. రామ్మూర్తి నాయుడు మరణవార్తతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో విచారం నెలకొన్నది.