ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్నారు. మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం కుదరలేదో… వారికి వివరించి చెబుతున్నారు. దీంతో అసంతృప్తులు మెత్తబడుతున్నారు. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఎంపీ మోపిదేవితో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. అయితే.. హోంశాఖ మాజీ మంత్రి సుచరితకు మాత్రం ఏపీ సీఎం ఝలక్ ఇచ్చారు. ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. చాలా సార్లు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం సుచరిత ప్రయత్నాలు చేస్తున్నా… జగన్ మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మాజీ మంత్రి సుచరితపై సీఎం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది.
తనకు కేబినెట్లో తిరిగి బెర్త్ దక్కకపోవడంపై హోం శాఖ మాజీ మంత్రి సుచరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సంచలన రేగింది. తోటి వారిని మంత్రులుగా కొనసాగించి, తనకు మాత్రం ఎందుకు కేబినెట్ బెర్త్ దక్కలేదని నిలదీశారు. అంతేకాకుండా తనకు సీఎం జగన్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.