అమరావతి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(CM Chandra Babu) బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా గురువారం అమరావతి రాజధానిని సందర్శించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా నాడు టీడీపీ హాయంలో చేపట్టిన భవనాల పనులను పరిశీలించనున్నారు. ముందుగా గత వైసీపీ (YCP) ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుందని ఏపీ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) వెల్లడించారు.
అమరావతి రాజధాని శిలాఫలకంతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్జిలు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లను, భవనాలను ఆయన పరిశీలిస్తారని తెలిపారు. చివరగా సీఆర్డీఏను సందర్శిస్తారని చెప్పారు. టీడీపీ హాయంలో 2014-09 వరకు అనేక పనులు చేశామని ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
అమరావతిలో చేపట్టిన నిర్మాణపనులు మరమ్మతులకు లోనయ్యాయని, వీటిని పూర్తి చేసేందుకు గాను కమిటీలను నియమించి వ్యయ ప్రతిపాదనలను తయారు చేస్తామని వెల్లడించారు. నిర్మాణ సంస్థలకు విధించిన టెండర్లు కాలపరిమితి పూర్తయినందున తిరిగి రీటెండరింగ్ వేసి క్యాబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిర్మాణ సామగ్రిని చోరీ చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టిరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.