అమరావతి : ఏపీ మంత్రివర్గ (AP Cabinet ) సమావేశం ఫిబ్రవరి 6న జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra babu) అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం సర్క్యులర్‌ను జారీ చేసింది.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రంలోగా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం కోసం పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించి ఆమోదం తెలుపనున్నారు. పంచాయతీల్లో ఈ గవర్నెన్స్ అమలు తదితర అంశాలను చర్చించే అవకాశముంది.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఉన్నతాధికారులు దావోస్‌లో పర్యటిస్తున విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు గాను దావోస్‌లో జరిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను, ప్రముఖులను కలిశారు. నాలుగు రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగియనుంది. చంద్రబాబు బృందం అక్కడి నుంచి బయలు దేరి అర్ధరాత్రి ఢిల్లీకి, శుక్రవారం ఏపీకి చేరుకోనున్నారు.