అమరావతి : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే మరో మాజీ ఎమ్మెల్యే ( Former MLA) కూడా వైసీపీకి ఝలక్ ఇచ్చారు.
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) ఇక పార్టీలో ఉండడం లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు వెల్లడించారు. కాగా ఆయన టీడీపీలో చేరేందుకు అవకాశాలున్నట్లు అనుచరులు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా ఆక్వా పరిశ్రమను నడుపుతున్న గ్రంధి శ్రీనివాస్ ఇళ్లపై ఇటీవల ఇన్‌కంటాక్స్ అధికారులు వరుస దాడులు నిర్వహించారు.
పార్టీలో బ్రిటీష్ విధానాలు నచ్చకే రాజీనామా
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో బ్రిటీష్ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
ఐదేండ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఐదేండ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్) ఆదేశాలిస్తే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.