AP News | ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో జరిగిన దాడుల్లో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, తలలు పగిలాయని అని తెలిపారు.
ఈ దాడులకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా బాధ్యుడేనని విరూపాక్షి అన్నారు. దీనిపై ఆయన వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడులకు అరికట్టాలని.. ఇవి ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడిని కొంతమంది దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. దాదాపు 40 మంది దుండగులు దాడి చేసి హతమార్చినట్లుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే తన భర్తను చంపేశారని సుబ్బరాయుడు భార్య ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై వైఎస్ జగన్ సీరియస్‌గా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని జగన్ అన్నారు.
నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటనలు వీటికి నిదర్శనాలే అని జగన్ పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోవడంతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్లపైకి రాకూడదని ప్రజలను, వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌కు #SaveAPFromTDP హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.