Allu Arjun | సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా పిఠాపుంర వెళ్లి.. బాబాయ్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. కానీ అదే మెగా ఫ్యామిలీ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం జనసేనాని కూటమికి వ్యతిరేకంగా వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలలో ప్రచారం చేశారు.
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. తన మిత్రుడి కష్టం కళ్లారా చూశానని.. అందుకే ఇక్కడి వరకు వచ్చానని తెలిపారు. తనకు, రవికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ ఏనాడూ ఆయన తనను ప్రచారానికి రమ్మని పిలవలేదని చెప్పారు. రవి కష్టాన్ని చూసి తానే నంద్యాలకు వచ్చానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో రవికి మద్దతుగా ట్వీట్ చేశానని.. ఈసారి కూడా అలాగే చేయొచ్చని.. కానీ ట్వీట్ పెడితే మనసుకు సరిపోదని.. ఇంటికి వచ్చి సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. తన వాళ్లు ఏ రంగంలో ఉన్నా.. తన మనసుకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
అయితే.. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో బన్నీ ప్రచారం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీ కాబట్టి పవన్ కల్యాణ్‌కే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అందరి ఊహలకు తగ్గట్టుగానే పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ‘ మీ ఈ ప్రయాణంలో అనుకున్నది సాధించాలి.. సేవ చేయాలని, సేవకే అంకితం కావాలని ఎంచుకున్న ఈ మార్గం పట్ల నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది. ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను’ అని బన్నీ ట్వీట్ చేశారు. దీంతో జనసేనకు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారని మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. అయితే బన్నీ మద్దతు కేవలం పిఠాపురం వరకు మాత్రమే ఉందని.. పార్టీ మొత్తానికి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే నంద్యాలకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ తన మిత్రుడి కోసం బన్నీ బరిలోకి దిగారని అభిప్రాయపడుతున్నారు.