అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohanreddy ) ఏపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ ( Ganja Andhra Pradesh ) గా చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోలీసులే గంజాయితో దొరకడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎవరిని నమ్మాలని, ఎవరికి ఫిర్యాదు చేయాలని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్‌షాపులు నడుస్తున్నాయనని ఆరోపించారు.కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికి వ్యాపించిందని విమర్శించారు.
ఎల్‌నినో ( Elnino ) ప్రభావం ఉంటుందని తెలిసినా ప్రభుత్వం ఇంకా మేల్కోనడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, సీఎం చంద్రబాబు స్పందించడం లేదని, కుంభకర్ణుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీశైలం కింద నీళ్లు ఇస్తారనే నమ్మకంతో సాగు చేసుకుంటున్న రైతులకు మొండిచేయి చూపడం వల్ల నష్టపోయిన రైతాంగానికి రూ. 15 వేల నష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2
019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీవో నంబర్-176 ఇచ్చి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అయితే నాడు చంద్రబాబు తన మనుషులతో హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించి రిజర్వేషన్నుఆపివేయించాడని గుర్తు చేశారు.
తిరిగి అధికారంలోకి వచ్చి తరువాత చంద్రబాబు అదే రిజర్వేషన్‌పై కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తమ కేబినెట్లో మొత్తం 25 మంది ఉంటే అందులో బీసీలే 11 మంది ఉన్నారని స్పష్టం చేశారు. బీసీలు రాజకీయంలో ఎదుగుదలను ఓర్చుకోలేక వారిమీద అక్రమకేసులు పెట్టి, జైల్లో పెట్టిస్తున్నారని ఆరోపించారు.