చిత్తూరు: సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై దొడ్ల డెయిరీ సమీపంలో చోటుచేసుకున్నది. రెండు వాహనాలు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి వాహనంలో ఉన్న వ్యక్తి ఆ మంటలకు ఆహుతయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై దొడ్ల డెయిరీ సమీపంలో సోమవారం అర్ధరాత్రి పలమనేరు నుంచి వీ కోట వైపు వెళ్తున్న టిప్పర్ సుమోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి టిప్పర్, సుమో రెండూ దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సుమోలో ఉన్న వ్యక్తి బయటకు రాలేక ఇరుక్కుపోయాడు. పలమనేరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సజీవ దహనమైన వ్యక్తికి సంబంధించి వివరాలు తెలియరాలేదు.
జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ భాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సుమో పూర్తిగా దగ్ధమైనందున దానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.