అమరావతి : గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్భంగా ఏపీలో బుధవారం నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu ) వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్తపన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అందరూ ముందుకెళ్లాలని సూచించారు. 2029కల్లా ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా కావాలని పిలుపునిచ్చారు.
మచిలిపట్నంలోని నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ (Mahatma Gandhi ) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో రోడ్లపై చెత్త ఉండకూడదని అన్నారు. చెత్త పన్ను రద్దుపై కేబినేట్ తీర్మానం చేస్తామని అన్నారు. పింగళి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని సీఎం ఆరోపించారు. ఆంధ్ర జాతీయకళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని , 2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తకుప్పలుగా పేరుకుపోయిందని విమర్శించారు. ఈ చెత్తను తొలగించాలంటే రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు.
ఇటీవల విజయవాడను వరద ముంచెత్తినప్పుడు పారిశుద్ధ్య కార్మికుల కృషి వల్లే అంటువ్యాధులు ప్రబల లేదని కొనియాడారు. అనంతరం డంపింగ్ యార్డును చంద్రబాబు పరిశీలించారు. ఆయన వెంట కొల్లు రవీంద్ర , పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.