అమరావతి : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు సాదరస్వాగతం పలికారు. అనంతరం కార్యాలయం మొత్తాన్ని పరిశీలించారు. ప్రత్యేకంగా తనకు ఛాంబర్ లేకపోవడంతో డిప్యూటీ జనరల్ మేనేజర్ గదిలోనే బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించానని, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పట్ల పూర్తి అవగాహన పెంచుకొని శాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అయితే ప్రభుత్వం తనకు ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చినట్లు భావించడం లేదని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ డీజీపీగా పనిచేస్తున్న కాలంలో కొనుగోలు చేసిన పరికరాలలో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. దీంతో కోర్టు మెట్లెక్కిన ఆయన రెండేళ్ల పోరాటం తరువాత ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం ఇంకా తనకు ఉద్యోగ అవకాశం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ మరోసారి కోర్టుకు వెళ్లడంతో కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
ఉద్యోగ బాధ్యతలు వెంటనే అప్పగించాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించడంతో నిన్న ఏబీవీకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనరీగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏబీవీ ఇవాళ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.