అమరావతి : ఇంట్లో అద్దెకున్నవివాహితపై కన్నేసి ప్రభుద్దుడు ఆమెను మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..విజయవాడ అరండల్‌పేటకు చెందిన మహిళ (33)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈమె కుటుంబం మూడేళ్ల పాటు అరండల్‌పేటలోని నాగరాజు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగరాజుకు పెళ్లి కుదరడంతో సదరు వివాహిత కుటుంబంతో ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లో ఉంటుందన్నది.
పెళ్లైనా కూడా తనతో సంబంధం కొనసాగించాలని నాగరాజు మహిళను తీవ్రంగా వేధిస్తున్నాడు. దీనికి సదరు మహిళ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నాగరాజు కత్తి తీసుకుని వెళ్లి దాడి చేశాడు. గొంతుకోసి శరీరంపై కసిదీరా పొడిచి చంపేశాడు. అనంతరం తానూ పొట్టపై, గొంతుపై గాయం చేసుకున్నాడు. భవనంపై నుంచి దిగివచ్చి పక్కన ఉన్న కాలువలో దూకాడు. స్థానికులు గమనించిన స్థానికులు అతడిని రక్షించి దవాఖానకు తరలించారు. కాగా, తనకు చేతబడి చేయడం వల్లే ఆమెను మరిచిపోలేకపోతున్నానని, అందుకే చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.