AP News | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి చనిపోయినట్లుగా ఆడిన డ్రామా బెడిసికొట్టింది. శ్మశానం నుంచి ఓ శవాన్ని తీసుకొచ్చి కాల్చేసి తానే చనిపోయానని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దృశ్యం సినిమా రేంజ్లో ప్లాన్ చేసినప్పటికీ.. భార్య కారణంగా సీన్ బెడిసికొట్టి పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి కేతమళ్ల వేంకటేశ్వరరావు (పూసయ్య ) అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. రోజురోజుకీ అప్పులు, వడ్డీలు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థంకాక ఓ ప్లాన్ వేశాడు. తాను చనిపోతే రూ.40 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని భావించిన పూసయ్య.. ప్రమాదవశాత్తూ తాను మరణించినట్లు నమ్మించాలని అనుకున్నాడు. ఇందుకోసం రాజమహేంద్రవరం గ్రామీణం మోరంపూడికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శ్మశానం నుంచి ఒక మృతదేహాన్ని తీసుకొచ్చి తానే చనిపోయానని నమ్మించాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన మృతదేహాన్ని తీసుకొచ్చి.. వీరంపాలెంలోని ఓ పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. చనిపోయింది పూసయ్యే అని నమ్మించేందుకు అతని చెప్పులు, సెల్‌ఫోన్ అక్కడే పడేసి వెళ్లిపోయారు. జీడిమామిడి తోటలో పూర్తిగా కాలిపోయిన మృతదేహం దగ్గర లభించిన సెల్‌ఫోన్, మోటార్‌సైకిల్ ఆధారంగా చనిపోయింది పూసయ్యే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోస్టుమార్టం అనంతరం తన కుటుంబానికి అప్పగించారు.
తన భర్త నిజంగానే చనిపోయాడని భావించిన పూసయ్య భార్య గుండెలు పగిలేలా రోదించింది. తన భర్త లేని లోకంలో బతకడం ఎందుకని తాను కూడా చనిపోతానని ఆత్మహత్యయత్నం చేసింది. అయితే చనిపోయినట్లు డ్రామా మొదలుపెట్టిన క్రమంలో తన ఇంటిదగ్గర ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలియజేయాలని తనకు సహకరించిన ఇద్దరు వ్యక్తులకు పూసయ్య ముందే చెప్పిపెట్టాడు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర జరుగుతున్న పరిణామాలను పూసయ్యకు చేరవేశారు. భార్య ఏడుపుతో ఏదైనా ఆఘాయిత్యం చేసుకుంటుందేమోనని భావించిన పూసయ్య.. అప్పటికప్పుడు మరో ప్లాన్ వేశాడు.
వెంటనే తలారి సుబ్బారావు అనే వ్యక్తి ఫోన్ నుంచి తన భార్యకు పూసయ్య కాల్ చేశాడు. తాను బతికే ఉన్నానని చెప్పాడు. దీంతో భార్యతో పాటు అక్కడివారంతా షాకయ్యారు. అయితే ఎవరో గుర్తు తెలియని యువకులు మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని.. దీంతో ఆ వ్యక్తులు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి పిడింగొయ్య దగ్గరలో పడేశారని కాల్లో చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు. అయితే పూసయ్య శరీరంపై ఎటువంటి గాయం లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేసి.. తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం బయటకొచ్చింది.