అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మచిలీపట్నం రేషన్ బియ్యం ( Ration rice) మాయం కేసులో తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినానిపై (Perninani) కేసు నమోదు చేశారు.నానిపై ఏ-6 నిందితుడిగా బందరు తాలుకా పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
ఇప్పటికే రైస్ గోదాం నుంచి మాయమైన బియ్యం కేసులో పేర్నినాని భార్య జయసుధను ఏ1 కేసు నమోదు చేయగా కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురికి నిన్న రాత్రి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల పాటు రిమాండ్ (Accused Remand) విధించారు. నిందితులుగా ఉన్న మేనేజర్ మానస తేజ్‌ను, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జడ్జి వారికి రిమాండ్ విధించారు.
పేర్ని నాని భార్య జయసుధకు మళ్లీ నోటీసులు..!
పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు(Notices) జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మొదట 185 మెట్రిక్ టన్నులు బియ్యం మాయం అయ్యాయంటూ అధికారులు 1.68కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బియ్యం బస్తాలు మాయమైనట్లుగా తేల్చారు. మొత్తం గోడౌన్ నుంచి 378 టన్నులు కనిపించడం లేదని గుర్తించారు.ఈ క్రమంలో జరిమానా చెల్లించాలంటూ జయసుధకు జాయింట్ కలెక్టర్ తాజాగా నోటీసులు ఇచ్చారు.