(Red Sandal) చిత్తూరు: నాగలాపురం మండలంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వజ్జవారి కండ్రిగ సమీపంలోని సద్దికూటి చెరువు వద్ద పోలీసులను చూసిన స్మగ్లర్లు పారిపోయారు. వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు, వారి నుంచి 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో వజ్జవారి కండ్రిగలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి టీపీ కోట వైపు నుంచి సుమోలో వస్తున్న కొందరు వ్యక్తులు ఆందోళనకు గురై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దర్ని పట్టుకోగా, ఒకరు పారిపోయాడు. వీరిని విచారించిన పోలీసులు జంబుకేశపురం గ్రామంలోని సద్దికూటి మడుగు జలపాతానికి వెళ్లే మార్గంలో వాగు వద్ద నలుగురు వ్యక్తుల నుంచి రెండు బైక్‌లు, రెండు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమోలో 20 ఎర్రచందనం దుంగలు, సద్దికూటి మడుగు ఫాల్స్‌లో 15 ఎర్రచందనం దుంగలు మొత్తం 35 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 303 కిలోల బరువు ఉన్న ఈ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.9,10,500 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు.