కోనసీమ జిల్లా : అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌తో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 235 కు చేరింది. మరో 21 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నది. వీరి కోసం పోలీసులు గత రెండు నెలలుగా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ అల్లర్లపై రాజకీయంగా దుమారం రేగిన విషయం తెలిసిందే.
కోససీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో నిర్ణయం తీసుకున్నది. దీనిని నిరసిస్తూ కోనసీమ జిల్లా అంతటా నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా అమలాపురంలో ఆందోళనలు తీవ్రంగా కొనసాగాయి. మే 24వ తేదీన ఆందోళనాకారులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. అలాగే, పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనాకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయగా.. పలువురు గాయపడ్డారు.
ఈ అల్లర్ల కేసులో మొత్తం 258 మంది పాల్గొన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ, మీడియా క్లిప్పింగ్‌ల ద్వారా నిందితులను గుర్తించారు. ఇప్పటివరకు 220 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, శనివారం సాయంత్రం మరో 15 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు 235 మంది అరెస్ట్ కాగా.. మిగిలిన 21 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోనసీమ అల్లర్లు నేపథ్యంలో రెండు వారాల పాటు ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. ఘర్షణలు మళ్లీ తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.