Maoists | మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టుచేశారు. అలాగే ఏలూరులో 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని పరిణామాలతో మావోయిస్టులు ఏపీకి రావాలని చూస్తున్నారని మహేశ్ చంద్ర తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలిలకపై ఇంటెలిజెన్స్ నుంచి రెండు రోజుల క్రితం పక్కా సమాచారం వచ్చిందని చెప్పారు. మావోయిస్టులు ఏపీ నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చూశారని వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 6.30-7.00 గంటల మధ్య భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా, ఆయన సతీమణి సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారని పేర్కొన్నారు.
అలాగే ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని మహేశ్ చంద్ర తెలిపారు. అరెస్టయిన వారిలో 9 మంది మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్‌జీ అనుచరులుగా గుర్తించామని వెల్లడించారు. మిగిలినవారంతా సౌత్ బస్తర్ జోనల్ కమిటీ సభ్యులు అని పేర్కొన్నారు.