రాష్ట్రంలో పంట చేలపై మిడతల దాడి సర్వసాధారణంగా జరిగేదే. లక్షల సంఖ్యలో ఒకేసారి దాడికి దిగుతాయి. చూస్తుండగానే పంట మొత్తం నాశనమవుతుంది. వీటి వల్ల అప్పటివరకు పచ్చదనంతో ఉన్న పంట ఆకులన్నీ మాయమై కాండాలు, ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఫలితంగా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. మిడతల దాడి నుంచి పంటలను కాపాడుకోవడం రైతులకు కత్తిమీది సాములా తయారైంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మిడతలు మన పంటలపై దాడి చేయకుండా కాపాడుకోవచ్చు.
సాధారణంగా మిడతలు తక్కువ సంఖ్యలో ఉండి, పంటలపై అప్పుడప్పుడు ఆశిస్తాయి. కొద్దిగా నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల వాటి జీవిత చరిత్రలో మార్పులు వచ్చాయి. వాటి సంఖ్య ఉద్ధృతమవుతున్నాయి. వీటి తీవ్రత రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒకేసారి వృద్ధి చెంది పంటలపై దాడిచేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు వీటిని ఎప్పటికప్పుడు గమనించడానికి 1939 లో మిడత హెచ్చరిక కేంద్రాన్ని జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. వాళ్లు వాటి జీవిత చక్రాన్ని, ఉద్ధృతిని పూర్తిగా అంచనా వేస్తూ రైతులకు తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తారు.
ఈ మిడత లక్షణాలు..
మిడతలు సాధారణంగా గట్ట కింది భాగంలో, తేమ ఉన్న ప్రాంతంలో, భూమి లోపల 30-40 గుడ్లను ఒక సంచిలో పెడుతాయి. ఈ గుడ్లు పసుపు పచ్చరంగులో ఉండి ఒకదానితో ఒకటి జిగురుతో అంటుకుంటాయి. వీటికి చాలా తక్కువ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. గుడ్ల నుంచి వచ్చిన చిన్న పిల్ల మిడతలు సాధారణంగా గోధుమ వర్ణంలో ఉంటాయి. పెద్దగా అయ్యాక ఆకుపచ్చ, వివిధ రంగులలోకి మారుతాయి.
వీటిలో రెండు దశలు ఉంటాయి
1) స్థిర దశ
2) చలన దశ
కాలానుగుణంగా ఈ దశలలో మార్పు ఉంటుంది. ఒకేసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు చలన దశలోకి మారి ఒక గుంపులా లేదా దండులా వచ్చి పంటపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. మొదట ఆకుల చివర్లను, కొనలను గాయపరుస్తాయి. అలా మొత్తం ఆకులను తింటాయి. గంటల వ్యవధిలోనే పంట మొత్తం కాండాలతో మాత్రమే కనిపిస్తుంది.
యాజమాన్య పద్ధతులు
– మిడతలు సాధారణంగా వీధి దీపాలకు ఆకర్షితమవుతాయి. గడ్డి, కలుపు మొక్కలపై ఉంటాయి. అందువల్ల గట్ల మీద ఉండే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలి.
– పంట చుట్టూ, పంటలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి.
– వరిలో వారానికి ఒకసారి నీళ్లను వదిలేస్తూ ఉండాలి.
– గట్ల కింది భాగాన్ని ఎప్పుడు తవ్వుతూ, గుల్లగా మార్చాలి. దీనివల్ల వాటిలో ఉన్న గుడ్లు, చిన్న పిల్ల దశలు ఎండ తీవ్రతకు చనిపోతాయి.
– మిడతలు ఉనికిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా మిడతల గుంపు గమనించగానే, మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి.
– మిడతల ఉనికికి గమనించగానే క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా మలథియాన్ 2 మి.లీ. లీటరు నీటితో కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలి.
– లేదా మిథైల్ ఫరాథియాన్ 10 కిలోలు ఒక ఎకరానికి లేదా డైక్లోరోవాస్ 1.5 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి సమర్థంగా నివారించవచ్చు.
ఒకరిద్దరు రైతులు నివారణ పద్ధతులు పాటిస్తే ఈ మిడతల గుంపులను నివారించలేం. ఈ విధంగా రైతులందరూ సమష్టిగా తగిన సూచనలు పాటిస్తే మిడతల దండును సమూలంగా నివారించవచ్చు. అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఇంటి తోటల్లో నివారణకు ఇలా చేయండి..
ఇంట్లోనే వెల్లుల్లి మిరప మిశ్రమంతో స్ప్రే తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లా చేసి, దానికి కొంచెం నీరు పోసి మొక్కలపై పిచికారీ చేయాలి. వెల్లుల్లి స్ప్రే వాసన కీటకాలను తిప్పికొడుతుంది.
మొక్కలపై కొంచెం వేపనూనె పిచికారీ చేయడం ద్వారా కూడా మిడతలను రాకుండా చూసుకోవచ్చు. వేప నూనె మిడుతల దండును నివారిస్తుంది. ఈ నూనె వాటిని నీరసంగా మార్చి దాదాపు కదలకుండా చేస్తాయి. తద్వారా ప్లేగును నియంత్రించడంలో కూడా సహాయపడతుంది.
మిడతల సమూహాన్ని తటస్తం చేయడానికి కలపను కాల్చడం లేదా ధూపం కర్రలను వెలిగించడం ద్వారా తోట ప్రాంతం చుట్టూ కొంత పొగను సృష్టించాలి. ఈ పొగ కారణంగా మిడతలు ఇంటి పరిసరాలకు రాకుండా ఉంటాయి.
మిడతలను పారిపోయేట్లు చేయడానికి శబ్దానికి మించింది లేదు. ఉదయం 4-6 గంటల మధ్య మిడతలు సాధారణంగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ సమయంలో పాత్రలను కొట్టడం లేదా లౌడ్‌స్పీకర్‌ని ఉపయోగించి సౌండ్ చేయాలి. సౌండ్ మిడతలను భయపెట్టి పారిపోయేలా చేస్తుంది.