భద్రాద్రి జిల్లాలో 350 ఎకరాల్లో సాగు
కూరగాయల్లో అగ్రస్థానం బోడకాకరది. ధరలో దీనికిదే సాటి. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటిది. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో బోడకాకర సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 350 ఎకరాల్లో సాగు చేస్తూ, భారీ లాభాలు పొందుతున్నారు.
బోడకాకర సాగును అన్ని పంటల కంటే ముందుగానే (మే నెలలోనే) ప్రారంభిస్తారు. రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్ ముగిసే నాటికి రూ.200కుపైగా పలుకుతుంది. అధిక మొత్తంలో దిగుబడి వచ్చే బోడకాకరలో పోషకాలు, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. అందుకే వినియోగదారుల్లో దీనికి ఆదరణ ఎక్కువ.
రైతుల ఆసక్తి..
ఇతర కూరగాయలతో పోలిస్తే బోడకాకర సాగు మంచి లాభదాయకం. దీన్ని సాగు చేసిన రైతుకు నష్టమనేది లేకపోవడం విశేషం. దిగుబడి తగ్గితే.. లాభంలో తగ్గుదల ఉంటుంది కానీ, నష్టం మాత్రం రాదు. ఒక ఎకరంలో బోడకాకర సాగు చేసే రైతుకు 4 నుంచి 6 నెలల కాలంలో కనీసం రూ. 4లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. దిగుబడి పెరిగితే ఆదాయం రూ. 6 లక్షలకు చేరుతుంది. ఎకరానికి కనీసంగా 40-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేజీ ధర కనీసంగా రూ.100 లెక్కించినా, 40 క్వింటాళ్లకు రూ.4 లక్షల ఆదాయం వచ్చినట్లే! అందుకే, వరికి ప్రత్యామ్నాయంగా బోడకాకరను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
రూ.లక్ష సబ్సిడీ..
బోడకాకర సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం రూ.లక్ష వరకూ సబ్సిడీ ఇస్తున్నది. బోడకాకర సాగుకు ముఖ్యంగా కావాల్సింది పందిళ్లు. వాటి ఏర్పాటుకు గతంలో ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈజీఎస్ ద్వారా ఎకరానికి రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, సుజాతనగర్, ఇల్లెందు, అశ్వాపురం, బూర్గంపహాడ్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, జూలూరుపాడు, అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో 350 ఎకరాల విస్తీర్ణంలో బోడకాకరను సాగు చేస్తున్నారు.
మంచి లాభాలు..
వరికి ప్రత్యామ్నాయంగా బోడకాకర పంట సాగు చేస్తున్నాను. రూ.57 వేల వరకూ ఖర్చవుతుంది. దానిపై ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నా. ఈ ఏడాది బోడకాకరలో అంతర పంటగా ఉల్లిగడ్డ సాగు చేస్తున్నా. మంచి దిగుబడి వచ్చింది. రైతులు వరిని వదిలి ఇతర పంటల వైపు మళ్లాలన్న సీఎం కేసీఆర్ పిలుపు వల్ల మంచి లాభాలు వస్తున్నాయి.
కణతాల శ్రీనివాసరావు, రైతు, గంగాపురం
– గంగారపు శేషయ్య