నోరూరించే డ్రాగన్ ఫ్రూట్స్.. ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. వాటిని సాగు చేసే రైతుకు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ పండ్లు.. ఒకప్పుడు కోల్‌కతా, ముంబై లాంటి నగరాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు.. తెలంగాణలోని పల్లెల్లోనూ విరగ పండుతున్నాయి. రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి.
ఏడాదిన్నర క్రితం ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగుకు శ్రీకారం చుట్టాడు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్‌కు చెందిన రైతు మైలారం వెంకన్న. ఇందుకోసం విజయనగరం, నెల్లూరు, రాజేంద్రనగర్ వెళ్లి సాగుపై అధ్యయనం చేశాడు. సర్కారు కూడా ప్రోత్సాహం అందిస్తూ ఎకరానికి రూ. 5 లక్షలు మంజూరు చేయగా, రైతు తన వాటాగా రూ. 1.25 లక్షలు (25 శాతం) పెట్టుబడిగా పెట్టాడు. పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎకరం పొలంలో ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం 8 అడుగుల ఎత్తు ఉన్న సిమెంటు స్తంభాలను, రెండు అడుగుల లోతుతో పాతాడు.
ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఒక్కో స్తంభం చుట్టూ నాలుగు మొక్కలు నాటాడు. ఇలా ఎకరం పొలంలో 504 స్తంభాలు పాతి, 2028 మొక్కలను నాటాడు. ఇవి 25 ఏండ్ల వరకూ దిగుబడి ఇస్తూనే ఉంటాయి. ఈ మొక్కలకు డ్రిప్ ద్వారా 15 రోజులకు ఒకసారి నీటిని అందించాడు. నెలకోసారి పశువుల పేడ, వానపాములతో తయారైన ఎరువును మాత్రమే వేశాడు. పంటకు సోకే ఏకైక లద్దె పురుగు నివారణకు వేపాకులతో తయారైన నూనెను పిచికారీ చేశాడు. భారీ దిగుబడి రావడంతో, పండ్లను హైదరాబాద్‌కు తరలించాడు. కిలోకు రూ. 300 నుంచి రూ. 400కు విక్రయించాడు. గతేడాది ఎకరానికి దాదాపు రూ. 3 లక్షల నుంచి రూ.4. 5 లక్షల దాకా ఆదాయం పొందాడు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి పెరిగి రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల దాకా ఆదాయం రానున్నదని రైతు ధీమాగా చెబుతున్నాడు.
– కస్తూరి వేణుగోపాల్ రావు
తక్కువ నీటితోనే..
నాలుగేళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి డ్రాగన్ ఫ్రూట్ పంటపై అధ్యయనం చేశా. సబ్సిడీకి దరఖాస్తు చేసుకోగా, ప్రయోగాత్మకంగా జనగామ జిల్లా నుంచి అధికారులు నన్ను ఎంపికచేశారు. ప్రభుత్వం ఎకరానికి రూ. 5లక్షలు మంజూరు చేసింది. నా వాటాగా రూ. 1.25 లక్షలు పెట్టుబడి పెట్టా. గతేడాది రూ. 3 లక్షలు ఆదాయం వచ్చింది. ఐదో ఏట నుంచి దిగుబడితోపాటు ఆదాయం కూడా పెరగనున్నది. ఒక్కసారి నాటితే 25 ఏండ్ల వరకూ దిగుబడి వస్తూనే ఉంటుంది.
మైలారం వెంకన్న, రైతు, జీడికల్.