వ్యవసాయంలో మితిమీరిన రసాయన ఎరువుల వాడకంపై ఆ యువతి ఆందోళన చెందింది. నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడితేనే.. సమాజానికి ఆరోగ్యకరమైన పంటలను అందించవచ్చని నమ్మింది. అందుకే.. డిగ్రీ చదువుతూనే వ్యవసాయంలోకి అడుగుపెట్టింది. ‘పాలేకర్’ విధానాలతో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన బోడ శ్రీవనిత మైథిలి.
బోడ పుష్పలత – తిరుపతిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. పదేళ్ల క్రితం వరకూ అందరిలాగే వీరు కూడా సాగులో రసాయన మందులు వాడేవాళ్లు. ఆ సమయంలో డిగ్రీ చదువుతున్న వీరి కూతురు మైథిలి.. విషరసాయనాలతో భూసారం నాశనం అవుతున్నదని గుర్తించింది. వ్యవసాయంలో మందుల ప్రభావాన్ని తగ్గించాలని తల్లిదండ్రులకు సూచించింది. ఈ క్రమంలో ఓ వైపు చదువుకుంటూనే.. సుభాష్ పాలేకర్ శిక్షణ శిబిరాలకు హాజరైంది. ఆ స్ఫూర్తితో వ్యవసాయంలోకి అడుగుపెట్టి, పదేళ్ల క్రితమే అరెకరంలో పసుపును సహజసిద్ధంగా పండించింది. మంచి దిగుబడి రావడంతో తమకున్న మొత్తం ఐదెకరాల్లో వివిధ రకాల పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నది. తాను సాగు చేస్తున్న ఉత్పత్తులతో ‘రోగాలు సున్నా – ఆరోగ్యం మిన్న’ అని చాటుతున్నది.
సేంద్రియ ఎరువుల తయారీ కోసం ఐదు దేశీ ఆవుల్ని పెంచుతున్నది మైథిలి. వాటి మూత్రం, పేడతో ఎరువులు తయారు చేస్తున్నది. వాటిని ఉపయోగిస్తూ.. పంటపంటకూ భూసారాన్ని పెంచుకుంటున్నది. తకువ పొలంలోనే ఎక్కువ దిగుబడి సాధిస్తున్నది. మొత్తం ఐదెకరాల పొలంలో మూడున్నర ఎకరాల్లో వరి, అర ఎకరంలో పసుపు, ఎకరంలో దేశీ రకం అరటి పంటలు వేసింది మైథిలి. వరిలో ఎర్ర, నల్ల, సెంటెడ్ కాలబట్టి, కృష్ణా బ్లాక్ రైస్, రెడ్ రైస్‌లో నవారా, రక్తశాలి రకాలు, సెంటెడ్ రైస్‌లో మహారాజ సుగంధ రైస్, చిట్టి ముత్యాలు, మహారాజ సెంటెడ్, కుజీపటాలియా, రత్నచోడి రకాలను పండిస్తున్నది. ఎకరానికి 20 బస్తాల వరకు నల్ల బియ్యం దిగుబడి సాధించింది. రెడ్‌రైస్ 25-30 బస్తాలు(70 కేజీలు), బ్రౌన్‌రైస్ 30-40 బస్తాలు, సుగంధ బియ్యం 30-40 బస్తాలు, దేశీయ చిట్టి ముత్యాలు 20-25 బస్తాలు వస్తున్నాయి. ధాన్యాన్ని ఏడాదిపాటు నిల్వపెట్టి, ఆ తర్వాత బియ్యం పట్టించి విక్రయిస్తున్నది మైథిలి. సాధారణంగా హైబ్రీడ్ రకాన్ని పండించే రైతులు.. అన్ని ఖర్చులూ పోను ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకూ సంపాదిస్తారు. మైథిలి మాత్రం అధిక ధర పలికే ధాన్యాన్ని పండిస్తూ.. ఎకరానికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు సంపాదిస్తున్నది.
అర ఎకరంలో దుగ్గిరాల నాటు పసుపును పండిస్తున్నది మైథిలి. సాధారణంగా పండించే హైబ్రీడ్ రకం ఒక ఎకరంలో 15 – 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెడితే.. రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఆదాయం వస్తుంది. అయితే, మైథిలి సాగు చేస్తున్న దుగ్గిరాల నాటు పసుపు ఎకరానికి 10 – 15 క్వింటాళ్లే దిగుబడి వస్తుంది. కానీ, ధర మాత్రం రెట్టింపు పలుకుతుంది.
మైథిలి వ్యవసాయ క్షేత్రంలో 9 రకాల దేశీయ అరటిపండ్లు పండుతున్నాయి. ఇందులో రెడ్బనానా(చెంగదలి), నేంద్రన్, పువ్వెన్, న్యాలిపువ్వెన్, పాలయంతోడెన్, చుండిల్లకన్నన్, చక్కెరకేళి, కర్పూరం, యాలక్ రకాలను పండిస్తున్నది. ఇవన్నీ దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని రకాలు ఆరోగ్యాన్ని అందిస్తే.. మరికొన్ని రుచిగా, సువాసనతో ఉంటాయి. ఫైబర్‌తో పాటు ఎన్నో ఔషధ గుణాలున్న రకాలు మరికొన్ని.
వ్యవసాయంలో మైథిలి కృషికి అనేక అవార్డులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘పుడమి పుత్ర’ అవార్డు అందుకున్నది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘రైతు నేస్తం’ అవార్డునూ స్వీకరించింది.
2012లో డిగ్రీ చదువుతూనే వ్యవసాయంలోకి వచ్చా. 2021లో పెర్మాకల్చర్ కోర్సు పూర్తి చేశా. సుభాష్ పాలేకర్ విధానాలను అవలంబిస్తూ.. అనేక రకాల పంటలు పండిస్తున్నా. నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే.. సమాజ ఆరోగ్యం బాగుంటుంది. ఇది ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుంది. విషరసాయనాలతో భూసారాన్ని నాశనం చేయవద్దని కోరుతున్నా. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు మా ‘ప్రాణమా’ క్షేత్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. సాగు విధానాలను తెలుసుకోవచ్చు.
-బోడ శ్రీవనిత మైథిలి
-అంకరి ప్రకాశ్