ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : పట్టణంలోని పెద్దవాగులో పడి జైనూర్ (Jainur ) మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్ (17) మృతి చెందాడు. పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజంపేటకు చెందిన రేహన్, అయాన్లు ఇద్దరు అన్నదమ్ములు. వీరు మేనత్త కొడుకు మహబూబ్తో కలిసి ఆదివారం గోడవెళ్లి పెద్దవాగు ( Godavelli Peddavagu) లో స్నానానికి వెళ్లారు.
మొదట మహబూబ్ వాగు ప్రవాహానికి కొట్టుకు పోతుండగా అతనిని కాపాడటం కోసం రేహాన్ ప్రయత్నించాడు. ఇద్దరు కొట్టుకు పోతుండగా వాగు వద్ద ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ రెహన్ చెయ్యి పట్టుకొని బయటకు తీసి కాపాడగా మహబూబ్ గల్లంతయ్యాడు. సీఐ బాలాజీ వరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో మృత దేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.