మంచిర్యాల, మే 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని పలు గ్రామాల్లో పోలింగ్‌ను బహిష్కరించడం, ఈవీఎంలు మొరాయించడం, నాయకుల మధ్య గొడవలు ఇలా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికలను బహిష్కరించారు. దశాబ్దాలుగా రోడ్డు నిర్మిస్తామని చెప్తున్న అధికారులు, ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉంటామని తెలిపారు. చివరకు ఎంఆర్వో శంకర్ వచ్చి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు గ్రామంలో పోలింగ్ మొదలైంది.
ఇదే మండలంలోని దేగమా గ్రామంలో ప్రాజెక్టు కింద వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నామని, తమకు పునరావాసం కల్పించాలని, లేని పక్షంలో ఓటు వేయమని గ్రామస్తులు శపథం చేశారు. అధికారులు, స్థానిక నాయకుల జోక్యంతో చివరకు ఓటు వేశారు. ఇచ్చోడ మండలంలోని బాజ్జిపేటకు త్రీఫేజ్ కరెంట్, రోడ్డు వేయాలని స్థానికులు పట్టుబట్టారు. కలెక్టర్, డీఎఫ్‌వోలతో డిప్యూటీ తహసీల్దార్ రామారావు మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాక మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ మొదలైంది.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామస్తులు ఓటు వేసేందుకు రాలేదు. గ్రామానికి రోడ్డు నిర్మాణం చేస్తేనే ఓట్లు వేస్తామని ఇండ్లలోనే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి గ్రామస్తులను కలుసుకున్నారు. అల్లంపల్లి గ్రామానికి వెళ్లి అక్కడి వారితో చర్చించారు. మంత్రి సీతక్కను ఫోన్ లైన్లోకి తీసుకుని మాట్లాడించారు. అయినప్పటికీ గ్రామస్తులు అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో అందరం కలిసి నోటాకు ఓటు వేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు నిర్మల్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఏఎస్పీ సూర్యనారాయణ సర్ది చెప్పడంతో ఓట్లు వేసేందుకు వచ్చారు. దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 275 పోలింగ్ కేం ద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో ఇక్కడ పోలింగ్ కాస్త ఆలస్యంగా సాగింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ సమయం ముగియడంతో అప్పటివరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించలేదు. సిర్పూర్ కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల్లోని పలు కేంద్రాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
పెద్దపల్లిలో 67.80 శాతం..
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం ఆరు గంటల వరకు 67.80 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ధర్మపురి నియోజకవర్గంలో 73.34, అత్యల్పంగా మంచిర్యాల నియోజకవర్గంలో 59.78 శాతం న మోదైంది. పెద్దపల్లిలో 71.34, బెల్లంపల్లిలో 70.53, మంథనిలో 69.90, చెన్నూర్‌లో 68.13, రామగుండంలో 61.59 శాతం పోలింగ్ నమోదైం ది.
2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే మంచిర్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. బెల్లంపల్లిలో గత ఎన్నికల్లో 68.81శాతం పోలింగ్ ఉంటే 2024లో 70.53 శాతంగా ఉంది. మంచిర్యాలలో గతంలో 59.39 శాతం ఉండగా, ప్రస్తుతం 59.78 శాతం అయింది. చెన్నూర్ నియోజకవర్గంలో గతంలో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది. పోయిన ఎన్నికల్లో 70.23 శాతం పోలింగ్ శాతం నమోదవగా, ప్రస్తుతం 68.13 శాతానికే పరిమితమైంది.
ఆదిలాబాద్ ఎమ్మెల్యేతో గొడవ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 27వ పోలింగ్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కొందరు బీజేపీ నాయకులు కండువాలు వేసుకుని ఉండడం వివాదానికి దారి తీసింది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి భార్య మౌనారెడ్డి మరికొందరు మహిళలు బీజేపీ నాయకులకు ఇక్కడి నుంచి పంపించేయాలంటూ అధికారులను కోరారు.
ఓటు వేశాక కూడా పోలింగ్ కేంద్రం లోపల ఎమ్మెల్యే ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. కండువాలు వేసుకుని మరీ పోలింగ్ కేంద్రంలో ఉన్నా ఎలా అనుమతిస్తున్నారంటూ నిలదీశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ మహిళలకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అలాగే ఆదిలాబాద్‌లోని పుత్లీబౌలి 264, 265, 280 పోలింగ్ బుత్లతో ఉద్రిక్త వాతావారణం కనిపించింది. పోలింగ్ బూత్ పరిసరాల్లో తిరుగుతున్న కొందరు నాయకులను పోలీసులు చెదరగొట్టి పంపేశారు.
ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. వన్ టౌన్ సీఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన 99 సంవత్సరాల వృద్ధురాలు ముచ్చ ఎల్లక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారి జన్నావార్ కిశోర్(68) ఈ నెల 7వ తేదీన ఆస్ట్రేలియాలో మృతి చెందాడు.
ఇంకా మృతదేహం స్వగ్రామానికి చేరుకోలేదు. అయినప్పటికీ తండ్రి మృతిని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు సోమవారం బాధతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీవాడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి పార్టీ కండువా వేసుకుని వచ్చారు.
దీంతో బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణంలో నెలకొనడంతో పోలీసులు పరిస్థితిని సద్దుమనిగేలా చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్‌నగర్, పిట్టలవాడ, వడ్డెరకాలనీలోని ట్రాన్స్‌జెండర్స్ ఓటు వేశారు. తాంసి మండలంలోని అందర్‌బంద్‌లో ఆదివారం సాయంత్రం విధులక వచ్చిన ఉపాధ్యాయుడు విపుల్ రెడ్డిని పాము కాటు వేసింది. వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతున్నాడు.
ఆసిఫాబాద్ జిల్లాలో 67.67 శాతం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 67.67 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2,27,208 మంది ఓటర్లుండగా, 1,52,706 మంది ఓటేశారు.
అలాగే సిర్పూర్ నియోజకవర్గంలో 2,29,101 మంది ఓటర్లు ఉండగా, 1,56,098 మంది ఓటేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. 4 గంటల తర్వాత ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను పోలింగ్ సిబ్బంది లోనికి అనుమతించలేదు.
ఓటేసిన రాజకీయ ప్రముఖులు..
ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రాజకీయ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ సురేశ్‌కుమార్, తిర్యాణి మండలం చింతలమాదారలోని మందగూడ పోలింగ్ కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కుటుంబ సభ్యులు, తిర్యాణి మండలం లక్ష్మీపూర్‌లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు, కుటుంబ స భ్యులు, కాగజ్‌నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆయన సతీమణి రమాదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్లోని పోలింగ్‌కేంద్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ఆయన సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, హిందీ హైస్కూల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయన సతీమణి రాజకుమారి, బీఆర్ఎస్ యూత్ నాయకుడు విజిత్‌రావు, ఆయన సతీమణి ఉదయశ్రీ, జడ్పీ బాలుర పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, ఆయన సతీమణి హేమనళిని, మంచిర్యాలలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ సంతోష్,
నెన్నెల మండలం జెండావెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, మందమర్రిలో జబర్దస్త్ వెంకీ, ఆయన భార్య వైష్ణవి, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఆయన సతీమణి రాణీఅలేఖ్య, క్రీస్ట్ ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్, తన భార్య, కుమార్తె, గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్, తన సతీమణి స్నేహలతతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకోని ఎమ్మెల్యే వినోద్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. నియోజకవర్గ ప్రజాప్రతినిధే ఓటు హక్కును వినియోగించుకోడమేమిటని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12, స్ట్రీట్ నంబర్ 17, ప్లాట్ నంబర్ 57లోని ఇంటి నంబర్ 8-2-684/3/57తో వినోద్ అక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నాడు. ఒకసారి మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన ఓటు హక్కు వినియోగించుకోకపోవడమేమిటని, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. సోమవారం పలు పోలింగ్ బూతులకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించిన వినోద్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోంచుకోవాలని సూచించడం కొసమెరుపు.
పోలింగ్ ఏజెంట్ కుటుంబ సభ్యులపై దాడి
ఆదిలాబాద్ పట్టణంలోని పర్కోటఖిల్లా కాలనీలో ఓ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ కుటుంబ సభ్యులపై సోమవారం రాత్రి మరో పార్టీకి చెందిన వారు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఏజెంట్ ఇంటిపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇందులో ఇద్దరి గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఓ వర్గానికి చెంది వారు స్థానిక వన్ టౌన్ ఎదుట గుమిగూడారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి దాడికి సంబంధించిన వివారాలను సేకరిస్తున్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
దండేపల్లి మండలంలో నెల్కివెంకటాపూర్, పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. మాక్ పోలింగ్‌లో కుందేళ్లపహాడ్ 41వ పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ మొరాయించింది. దీంతో 9 గంటల వరకు పోలింగ్ నిలిచిపోయింది. తాండూర్లోని కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలలో చార్జింగ్ లేక కొంతసేపు ఓటింగ్ ఆలస్యమైంది. హాజీపూర్ మండలం నంనూర్, కర్నమామిడి, సబ్బపెల్లిలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట పోలింగ్ ఆలస్యంగా మొదలైయింది. లక్షెట్టిపేట మండలం పాతకొమ్ముగూడెం గ్రామంలో ఈవీఎం మిషన్ రెండు గంటలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది.
కోటపల్లి మండలం మావోయిస్టు ప్రభావిత గ్రామమైన పంగిడిసోమారంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో శాటిలైట్ ఫోన్లను ఉపయోగించారు.
కౌటాల మండల కేంద్రంలోని కోయగూడలో బీజేపీకి చెందిన నాయకులు కమలం గుర్తు, అభ్యర్థి ఫొటోతో ఉన్న పోల్ చీటీలను ఓటర్లకు పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకులు పోల్ చీటీలు పంపిణీ చేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
చెన్నూర్ పట్టణంలోని 190వ పోలింగ్ కేంద్రంలో 105 ఏళ్ల వృద్ధుడు రేవెల్లి పోచం వీల్ చైర్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 191 బూత్‌లో చీకటి శ్రావణ్ ఓటును అప్పటికే వేరొకరు వేసి వెళ్లారు. దీంతో శ్రావణ్ చాలెంజ్ ఓటు వేశారు.
తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ కాసిపేట మండలం పాత వరిపేట, కొత్త వరిపేట గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. కాసిపేట ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, అధికారులు సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరిగాం గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం లేదని ఎన్నికలు బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి రావీ శ్రీనివాస్ గ్రామానికి చేరుకొని మంత్రి సీతక్కతో ఫోన్ మాట్లాడించి రోడ్డు వేస్తమని స్పష్టమైన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జైనూర్ మండల కేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ వర్గానికి చెందిన మరో యువకుడు బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని బైక్‌తో ఢీకొట్టిన యువకుడే తన బంధువులు, సామాజిక వర్గానికి తెలుపగా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సుమారు మూడు వందల మంది ఒడ్డెర కాలనీకి చేరుకొని కర్రలు, రాడ్లతో దాడులకు తెగపడ్డారు. అక్కడికి వెళ్లిన పాత్రికేయులపైనా దాడి చేశారు. వారి ఫోన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మర్సుకోల లక్ష్మణ్‌తో పాటు 9 మంది గాయపడ్డారు.