కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ బిడ్డల విద్యాభ్యాసానికి పూరి పాకే దిక్కయ్యింది. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో పక్కా భవనం కోల్పోగా పిల్లలు కనీస వసతులు లేక అవస్థలు పడాల్సి వస్తున్నది. వాంకిడి మండలం చిన్ను పటేల్ గూడలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఉండగా, దాదాపు 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం నాలుగు వరుసల హైవే నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో ఈ పాఠశాల పక్కా భవనం పోయింది.
అదే సమయంలో భవన నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ. 23.70 లక్షలు మంజూరయ్యాయి. కానీ భవనం నిర్మించేందుకు స్థలం లేకపోవడంతో కొంతకాలం సమయం వృథా చేశారు. దీంతో అదే గ్రామానికి చెందిన ముకుంద్రావు పటేల్ స్థలాన్ని దానం చేశాడు. కానీ, అధికారులు మాత్రం భవనం నిర్మించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు నిలువ నీడలేక అవస్థలు పడాల్సి వస్తున్నది. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవిని వివరణ కోరగా పాఠశాల భవన నిర్మాణానికి నిధులు వచ్చాయని, త్వరలోనే భవన నిర్మాణం చేపడుతామన్నారు.
మా విద్యార్థులు చదువుకునే పాఠశాల హైవే నిర్మాణంలో పోయింది. భవన నిర్మాణానికి ఐటీడీఏ ద్వారా రూ. 23.70 లక్షలు మంజూరైనయి. భవన నిర్మాణానికి స్థలం లేదని కొంతకాలం సమయం వృథా చేసిన్రు. నా సొంత స్థలం ఇచ్చి కూడా చాలా కాలమైంది. ఇప్పటి దాకా పాఠశాల భవనం నిర్మించింది లేదు. ఓ ఇంటి ముందున్న గుడిసెలో విద్యార్థులు చదువుకోవాల్సి వస్తున్నది. పిల్లలంతా మస్తు తిప్పలపడుతున్నరు. ఇకనైనా భవనం నిర్మించాలి.
– ముకుంద్రావ్, పాఠశాలకు స్థలం దానం చేసిన గ్రామ పటేల్