చెన్నూర్ టౌన్, జనవరి 29 : చెన్నూర్ పట్టణంతో పాటు చుట్టు పక్క గ్రామాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మైదానంలో తమ ప్రాక్టీసును కొనసాగిస్తుంటారు. వివిధ పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. ఉదయం, సాయంత్రం పట్టణ ప్రజలు ఇక్కడే తమ వాకింగ్‌ను నిర్వహిస్తుంటారు. గతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఒకేచోట ఉండడంతో ఆ మైదానాన్నే ఇరువురూ వినియోగించుకునేవారు. పాఠశాల, కళాశాల వార్షికోత్సవాలు, స్వాతంత్ర, గణతంత్ర వేడుకలతో పాటు ఆటపోటీల నిర్వహణకూ ఇబ్బందిగా ఉండేది. వేర్వేరు తేదీల్లో పోటీలు నిర్వహించునేవారు. పట్టణంలోని పలు పాఠశాలలకు కూడా పెద్దగా క్రీడామైదానం లేకపోవడంతో క్రికెట్, కబడ్డీ, ఖోఖోవంటి పోటీలకు ఈ గ్రౌండ్‌నే ఉపయోగించేవారు. సంక్రాంతి, దసరా సందర్భాల్లో క్రీడాపోటీలను ఈ మైదానంలో జరిపేవారు. పోలీస్వంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఉదయం, సాయంత్రం ఇక్కడే ప్రాక్టీస్ చేస్తుంటారు. దీంతో ఈ పాఠశాల మైదానం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. మరో పెద్ద మైదానం లేకపోవడంతో ద్విచక్రవాహనాలు, కార్లు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకునేందుకు కూడా పలువురు ఈ గ్రౌండ్‌నే వినియోగిస్తుంటారు. దీంతో జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తేవి. సరైన సౌకర్యాలతో పాటు పోటీల నిర్వహణకు క్రీడా మైదానం అనువుగా లేకపోవడంతో ఆటల పోటీల నిర్వహణ ఇబ్బందయ్యేది.
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో చెన్నూర్‌లో రూ.2.65 కోట్లతో 6.34 ఎకరాల్లో మినీ స్టేడియం నిర్మితమవుతున్నది. జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల నిర్వహణకు వేదిక సిద్ధమవుతున్నది. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో చెన్నూర్-ఆస్నాద్ రహదారికి పక్కన మినీ స్టేడియం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. రన్నింగ్ ట్రాక్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. బాస్కెట్ బాల్, వాలీబాల్, ఖోఖో, షటిల్, తదితర కోర్టుల నిర్మాణం చివరిదశలో ఉన్నాయి. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, షటిల్‌తో పాటు పలు ఇండోర్ గేమ్స్ కోసం కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రహరీతో పాటు 10 హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. అవుట్ డోర్, ఇండోర్ గేమ్స్ క్రీడల నిర్వహణ ఏర్పాట్లను విప్ సుమన్ తరచూ సమీక్షిసున్నారు. మినీ స్టేడియంలో స్టేజీతో పాటు, క్రీడాకారులు బస చేసేందుకు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు కూడా నిర్మించారు. క్రీడాకారుల కోసం మరుగుదొడ్లు, తాగు నీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, క్రీడాకారులు, క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్ పట్టణ రూపురేఖలు మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నాం. ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆదర్శ నియోజకవర్గం కోసం ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. చెన్నూర్ ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. వివిధ పోటీల్లో సత్తాచాటి అనేక పురస్కారాలు అందుకుంటున్నారు. అందుకే ఇక్కడ క్రీడా మైదానం ఉండాలనే ఉద్దేశంతో మినీ స్టేడియం నిర్మిస్తున్నాం. ఇది పూర్తయితే క్రీడల నిర్వహణతో పాటు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. పోలీస్తో పాటు పలు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అవుట్ డోర్, ఇండోర్ గేమ్స్ కోర్టుల పనులు చివరి దశలో ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులతో నిరంతరం సమీక్షిస్తున్నా. త్వరలో ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తాం.
ఈ నెల 8న అస్సోంలో జరిగిన జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం వరంగల్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్) చే స్తున్నా. మా కోచ్ సాగర్ సార్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజూ చెన్నూర్ పట్టణంలో ని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అథ్లెటి క్స్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదే గ్రౌండ్లో చా లా మంది ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. వాలీబాల్, క్రికెట్ కూడా ఇక్కడే ఆడుతుంటారు. పూర్తిస్థాయిలో ప్రాక్టీస్‌కు కొంత ఆటంకంగా ఉంది. మాలాంటి క్రీడాకారుల కోసం పట్టణంలో మినీ స్టేడియం నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్టేడియంలో ప్రత్యేకమైన రన్నింగ్ ట్రాక్‌లు, వేర్వేరు కోర్టులు ఉండడంతో ప్రాక్టీసు సులువవుతుంది. క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ప్రత్యేక చొరవ తీసుకొని స్టేడియం నిర్మిస్తున్న విప్ సుమన్ సార్‌కు ధన్యవాదాలు.
నేను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నా. రోజూ మా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఫణిరాజ్ సార్ ఆధ్వర్యంలో మా స్కూల్ గ్రౌండ్లో వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నా. రన్నింగ్ కూడా చేస్తున్నా. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. చెన్నూర్‌లో మరో పెద్ద గ్రౌండ్ లేకపోవడంతో వివిధ క్రీడా పోటీల నిర్వహణకు ఇదే స్థలాన్ని వాడుతుంటారు. బైక్‌లు, కార్ల డ్రైవింగ్ కూడా ఇక్కడే నేర్చుకుంటారు. పట్టణంలో మినీ స్టేడియం దాదాపు పూర్తి దశకు చేరుకోవడంతో ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ ప్రాక్టీస్‌కు అనువుగా ఉంటుంది. చెన్నూర్‌లో చాలా మంది క్రీడాకారులున్నారు. ప్రత్యేకంగా స్టేడియం నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆటల వల్ల ఆరోగ్యంగా ఉండడమే గాకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా సాధించవచ్చు.