మంచిర్యాల, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి వరద ముప్పు నుంచి మంచిర్యాల పట్టణాన్ని కాపాడేందుకు నిర్మించాలనుకున్న కరకట్టలు ఇప్పట్లో కష్టమేనని స్పష్టమవుతున్నది. పూర్తిస్థాయి సర్వే చేసి, రెండు మూడేళ్లు సీరియస్‌గా పనిచేస్తే తప్ప అది సాధ్యం కాదని స్వయంగా యంత్రాంగమే చెబుతున్నది.
యేటా వర్షాకాలం వచ్చిందంటే చాలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి వరద ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో కరకట్టలు నిర్మించి తమకు రక్షణ కల్పించాలని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే ప్రధాన హామీగా రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరకట్టల నిర్మాణానికి కృషి చేశారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి, అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే పీఎస్సార్ సైతం కరకట్టల నిర్మాణంపై హామీ ఇచ్చారు. దీంతో ఏ పార్టీ గెలిచినా కరకట్టలు కట్టడం అనివార్యమైన అంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్లో కొంత డబ్బులు కేటాయించడంతో ఆశలు చిగురించాయి. కాకపోతే గోదావరి వరద పట్టణంలోకి రాకుండా కరకట్టలు నిర్మించడం సులభమయ్యే పని కాదని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి.
కరకట్టల నిర్మాణానికి అంచనాలు తయారు చేసేందుకు ఇరిగేషన్‌శాఖలో హైడ్రాలజీ విభాగం జిల్లా అధికారులను నివేదిక కోరింది. మంచిర్యాల ఎగువన గుడిపేటలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి విడుదల సామర్థ్యం ఎంత, ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక వరద ఎంత.. వరద వస్తే పట్టణం మునగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది. గోదావరి వరద ఎంత ఎత్తులో వస్తే రాళ్లవాగు వరద వెనక్కి వెళ్తుంది. రాళ్లవాగుకు వరద ఎక్కడ నుంచి వస్తుంది. పిల్లకాలువలు ఎక్కడెక్కడ వచ్చి కలుస్తాయి. కరకట్టలు కడితే క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే వరద గోదావరిలోకి రావడం ఎలా.. దాని కోసం ఏం చేస్తే బాగుంటుంది.
రాళ్లవాగులో సిల్క్ ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఇలా అనేక అంశాలపై సమగ్ర రిపోర్టు కోరింది. ఈ వివరాలన్నీ జిల్లా ఇరిగేషన్ శాఖనుంచి అందజేసే పనిలో ప్రస్తుతం జిల్లా అధికారులు ఉన్నారు. ఈ రిపోర్టు వెళ్లాక హైదరాబాద్ నుంచి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ మంచిర్యాలకు వచ్చి గోదావరి, రాళ్లవాగు బ్యాక్ వాటర్‌పై పూర్తిస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే కరకట్టల తుది డిజైన్ రూపొందించడం సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు.
పట్టణానికి ఎగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డిసార్జి కెపాసిటీ(నీటి విడుదల సామర్థ్యం) 20 లక్షల క్యూసెక్కులు. కానీ ఆ మొత్తంలో వరదలు వదిలే అవకాశం లేదు. 2021-22లో ఎల్లంపల్లి నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద వదిలారు. వందేళ్ల చరిత్రలో అదే అత్యధికం అని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే మంచిర్యాల పట్టణం రాళ్లవాగు కారణంగా ముంపునకు గురైంది. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు అప్పుడు కనిపించాయి. 2023లో 9 లక్షల క్యూసెక్కులు వదలగా, పట్టణంలో కొన్ని ప్రాంతాల్లోకి మాత్రమే వరద చేరింది. ఎన్టీఆర్ నగర్, రాంనగర్, సాయికుంట, ఎల్ఐసీ కాలనీల్లో కొంత వరకు ఇబ్బంది వచ్చింది.
ఈ లెక్కన 10 లక్షల క్యూసెక్కులు దాటితేనే వరద ముంపు సమస్య వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైడ్రాలజీ విభాగానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని, జిల్లా అధికారులు ఇచ్చిన రిపోర్టును పరిశీలించి హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్ వచ్చి సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తక్కువలో తక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వర్క్ మీదే మొత్తం డిపార్ట్మెంట్ పనిచేసినా చాలా సమయంలో పడుతుందని చెబుతున్నారు.
హడావుడిగా నిర్మాణం చేస్తే కరకట్టలతో ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ లెక్కన మంచిర్యాల కరకట్టల సర్వే జరిగి, పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండు.. మూడేళ్ల సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. అధికార పార్టీ లీడర్లు ఈ విషయంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరగా పూర్తయ్యేలా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.