భైంసా పట్టణంలో స్మార్ట్(ఫైబర్) సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ బండలు వినియోగదారుల చెంతకు చేరాయి. తక్కువ బరువు కలిగి ఉండి అధిక భద్రత ఇవ్వనున్నాయి. ఇండెన్ గ్యాస్ సంస్థ ద్వారా ప్రస్తుతం వినియోగంలోకి వచ్చాయి. కస్టమర్లు వారు సిలిండర్ కనెక్షన్ తీసుకున్నప్పటి డిపాజిట్ పోనూ మిగతా డిపాజిట్ చెల్లించి తీసుకోవచ్చు.
– భైంసా, అక్టోబర్ 26
ఇనుముతో తయారు చేసిన సిలిండర్‌ను మోసుకెళ్లాలంటే చాలా భారంగా ఉంటుంది. గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం కూడా కష్టమే. ఖాళీ సిలిండరే 16 కిలోలు ఉండగా.., ఫైబర్ సిలిండర్ 6.3 కిలోలు మాత్రమే ఉంటుంది. అలాగే అందులో గ్యాస్ ఎంత ఉందో కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సిలిండర్ లోపలి భాగం గోడలు మూడు వరుసలు ఫైబర్‌తో తయారు చేయడంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటుంది. గ్యాస్ ఒత్తిడి అధికమైతే సిలిండర్ లోపలి భాగంలో ఉండే గోడలు మెత్తబడుతాయి. తద్వారా పేలే అవకాశం తక్కువగా ఉంటుంది. ఐరన్ సిలిండర్లపై నీరు పడితే తుప్పు పడుతాయి. సిలిండర్ పెట్టే చోట నేల, బండలపై మరకలు ఏర్పడుతాయి. ఫైబర్ సిలిండర్‌తో ఆ ఇబ్బందులుండవు.
అందుబాటులో రెండు రకాలు..
రెండు రకాల పైబర్ సిలిండర్లను ఇండెన్ గ్యాస్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 10 కిలోలు, 5 కిలోల రూపంలో వినియోగదారులకు అందిస్తున్నది. 10 కిలోల సిలిండర్‌కు రూ. 3,350, 5 కిలోల సిలిండర్‌కు రూ.2,150 చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.789 చెల్లించి 10 కిలోల సిలిండర్, రూ.406 చెల్లించి 5 కిలోల సిలిండర్‌లో గ్యాస్ నింపుకోవచ్చు. ఇనుప సిలిండర్‌ను సంస్థకు ఇస్తే గతంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సమయంలో చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి ఇస్తారు. ఫైబర్ సిలిండర్ కోసం కొత్తగా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. భైంసా పట్టణంలో ఫైబర్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
పైబర్ సిలిండర్ సురక్షితం..
కొత్త ఫైబర్ సిలిండర్ ఎంతో సురక్షితమైంది. బరువు తక్కువగా ఉండడంతో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇందులో 5, 10 కిలోల రూపంలో సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ చెల్లించి వినియోగదారులు ఈ సిలిండర్లను తీసుకోవచ్చు. గతంలో చెల్లించిన డిపాజిట్ పోనూ మిగతాది చెల్లించి కూడా తీసుకోవచ్చు.
– అజయ్, మేనేజర్, కృపా గ్యాస్, భైంసా