చెన్నూర్ టౌన్, అక్టోబర్ 3 : చెన్నూర్‌లోని శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం చేసిన నేరస్తులకు సహకరించిన మరో ఏడుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు చెన్నూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
మత్తడి ధ్వంసం చేశారని గతంలో పెండ్యాల లక్ష్మీనారాయణ (లక్ష్మణ్ ఏ1), భీం మధూకర్ (ఏ2), రసమల్ల శ్రీనివాస్ (ఏ3), గోగుల దానయ్య (ఏ4)ను గతంలోనే అరెస్టు చేశారు. కాగా, నేరస్తులకు సహకరించారని నడిపెల్లి లక్ష్మణ్ రావు (ఏ7), మంచాల రాజబాపు (ఏ8), పెద్దింటి శ్రీనివాస్ (ఏ9), లక్కం రాజబాపు (ఏ10), పోగుల శేఖర్(ఏ11), ఇప్ప సంపత్ (ఏ12), ఉమేశ్ గిల్డా (ఏ13)లను ప్రస్తుతం (గురువారం) అరెస్టు చేశారు. కాగా, బత్తుల సమ్మయ్య (ఏ5), రాంలాల్ గిల్డా(ఏ6), ఎన్నం బానయ్య (ఏ14)లు పరారీలో ఉన్న ట్లు డీసీపీ పేర్కొన్నారు.
శనిగకుంటకు ఆనుకొని ఉన్న 15.20 ఎకరాల భూమిని 10 మంది గ్రూపుగా ఏర్పడి గోదావరిఖనికి చెందిన చెరుకు బుచ్చిరెడ్డి వద్ద కొనుగోలు చేసి, మళ్లీ వీరు 25.02,2022న చెన్నూర్‌కు చెందిన గొడిసెల బాపురెడ్డికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాపురెడ్డి వారికి రూ.నాలుగు కోట్లు చెల్లించారు. అప్పు డు కేవలం 4.20 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. మిగిలిన 11 ఎకరాలు చెరు వు ఎఫ్టీఎల్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ కాలేదు.
చెరువు నిండి అతడి భూమిలోకి నీరు వస్తుందని చెరువు వైపు మట్టి పోయించడంతో ఇండ్లకు ముంపు సమస్య పెరిగింది. యేటా వానకాలంలో తన భూమిలోకి నీరువస్తున్నదని, తనకు భూమి వద్దని, డబ్బులు వాపస్ ఇవ్వాలని బాపురెడ్డి భూమి అమ్మిన వ్యక్తులను ఒత్తిడి చేశాడు. దీంతో బత్తుల సమ్మయ్య ఆధ్వర్యంలో సదరు భూమికి చెందిన పలువురు కలిసి రూ.4 లక్షలు ఇస్తామని మత్తడి ధ్వంసం చేయాలని, సమస్య రాకుండా చూస్తామని, కాలనీలోకి నీరు కూడా రాదని ప్రోత్సహించారు. దీంతో పెండ్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న మత్తడిని ధ్వం సం చేశారు.
నేరం జరిగే ఒకరోజు ముందు రాంలాల్ గిల్డా, 13న భీం మధూకర్‌తో బ త్తుల సమ్మయ్య మాట్లాడినట్లు కాల్ డాటాలో వెల్లడైందని తెలిపారు. దీంతో 3న గురువారం మంచాల రాజబాపు, నడిపెల్లి లక్ష్మణ్ రావు, లక్కం రాజబాపు, పెద్దింటి శ్రీనివాస్, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేశ్ గిల్డాలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన నేరస్తులు బత్తుల సమ్మయ్య, రాంలాల్ గిల్డా, ఎన్నం బానయ్యలు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, ఎస్ఐ శ్వేత ఉన్నారు.
బ్లాస్టింగ్ సామగ్రి ఎక్కడిది?
మత్తడి ధ్వంసం కేసుకు సంబంధించి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. ఇందు లో సింగరేణికి చెందిన పేలుడు పదార్థాలు వినియోగించినట్లు తెలిపారు. కాగా, పోలీసులు మాత్రమే నల్గొండ జిల్లా చిట్యాల నుంచి జిలెటిన్ స్టిక్స్ తీసుకొచ్చారని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు, పోలీసులు చెప్పే విషయానికి పొంతన లేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. చిట్యాల నుంచి తెప్పిస్తే, అక్కడ వీరికి అమ్మిన వారిని అదుపులోకి తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘నమస్తే తెలంగాణ’ చెప్పిందే నిజమైంది
మత్తడి ధ్వంసం కేసులో అధికార పార్టీకి చెందిన కీలక వ్యక్తిని కేసు నుంచి తప్పించే అవకాశాలున్నాయని మొదటి నుంచి ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రచురించింది. గురువారం వెల్లడించిన ప్రెస్మీట్లో తెలిపిన ప్రకారం అదే నిజమైంది. నాటకీయ పరిణామంలో బాపురెడ్డిని ఇటీవల స్టేషన్‌కు తీసుకొచ్చి కొద్ది సేపట్లోనే వదిలేయడంతో ఇలా అరెస్టు చేసి.. అలా వదిలేశారని ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, పోలీసులు మాత్రం విచారణ మాత్రమే చేశామని చెబుతుండడం అనుమానాలకు తావిస్తున్నది. కాగా, కీలక సూత్రధారిని అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే చర్చ ప్రజల్లో వినిపిస్తుండడం గమనార్హం.