రెబ్బెన, జూన్ 15: ఈ నెల 1 వ తేదీన తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామంలో బాలుడి హత్య కేసు నిందితులను అరెస్టు చేసినట్లు రెబ్బెన సీఐ అల్లం నరేందర్ తెలిపారు. రెబ్బెన మండలకేంద్రంలోని సీఐ కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన బార్కుంట తరుణ్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. యువతి పలుమార్లు ప్రేమను తిరష్కరించింది. అయినా కూడా వెంట పడి ప్రేమించమని వేధించేవాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు కూడా తరుణ్‌ను మందలించారు. అయినా తరుణ్‌లో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు యువతిని ఆదిలాబాద్‌లోని మరో కూతురి ఇంటికి పంపించారు. తరుణ్ అక్కడికి కూడా వెళ్లి వేధించాడు. అయిన పట్టించుకోకపోవడంతో యువతి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు.
యువతి కుటుంబంలో ఒకరిని హతమర్చాలని భావించాడు. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన స్నేహితుడు దుర్గం నరున్కు విషయం చెప్పి సహాయం చేయాలని కోరగా అంగీకరించా డు. ఈ నెల 1వ తేదీన యువతి తల్లి ఉపాధిహామీ పనులకు వెళ్లగా సోదరుడు ఉదయ్‌కిరణ్(14) ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఇది గమనించిన ఇద్దరు ఇంట్లోకి వచ్చి వెంట తెచ్చుకున్న గ్లౌజులు, టవల్ సహాయంతో ఉదయ్‌కిరణ్ ముక్కు నోరు మూసి గొంతు నులమగా ఉదయ్‌కిరణ్ మృతి చెందాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. యు వతి తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఆ మె కుటుంబంపై ప్రతీకారంతోనే సోదరుడిని హత్య చేశాడని సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో తిర్యాణి ఎస్ఐ రమేశ్ ఉన్నారు.