ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలకు కొత్త ఆయుష్షు పోసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కళాఖండాల తయారీలో కీలక ముడిసరుకు అయిన ‘పొనికి’ కర్ర కొరత కారణంగా ఐదారేళ్లుగా బొమ్మల తయారీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అడవుల్లో పొనికి చెట్లు కనుమరుగై, కలప లభ్యత కష్టంగా మారింది. దీంతో పొనికి చెట్లను పెంచి, తద్వారా కర్రను అందుబాటులోకి తేవాలని అధికార యంత్రాంగం భావిస్తున్నది. హరితహారంలో భాగంగా ఐదు గ్రామాల పరిధిలో వీటిని నాటేందుకు నిర్ణయించింది. దీంతో కొయ్యబొమ్మ కళాకారుల ఉపాధికి భరోసా లభించినైట్లెంది.
-నిర్మల్, మే 20(నమస్తే తెలంగాణ)
నిర్మల్, మే 20(నమస్తే తెలంగాణ): నిర్మల్ కొయ్య బొమ్మలు అంటే తెలియని వారుండరు. కొంత కాలంగా ఈ బొమ్మల తయారీ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. దీనికి ప్రధాన కారణం వీటి తయారీలో ఉపయోగించే కర్ర కొరత. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పొనికి ప్లాంటేషన్ నిరంతరంగా చేయకపోవడం, అడవుల్లో ఉన్న పొనికి చెట్లు కనుమరుగై పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొన్నటి వరకు అటవీ శాఖ ఆధ్వర్యంలోని పలు టింబర్ డిపోల్లో పొనికి కర్ర నిల్వలు అందుబాటులో ఉండేవి. ఇక్కడి కళాకారులు టింబర్ డిపోల నుంచి పొనికి కలపను కొనుగోలు చేసి బొమ్మలు తయారు చేసేవారు. క్రమంగా ఆయా డిపోల్లో కలప నిల్వలు తగ్గిపోవడంతో పొనికి కలప కోసం కళాకారులు పొరుగు జిల్లాలతో పాటు, సరిహద్దు రాష్ర్టాల్లో కూడా అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో క్రమంగా కొయ్యబొమ్మల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. దాదాపు 200 మంది కళాకారుల కుటుంబాలు ఈ కొయ్యబొమ్మల ప్రరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. రాబోయే ఐదారేళ్లలో పొనికి కలప పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చని, దీంతో పరిశ్రమ ఉనికికి ముప్పు తప్పదని భావిస్తున్న నేపథ్యంలో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. గత 9 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకం కింద పొనికి మొక్కల ప్లాంటేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టేందుకు నిర్ణయించింది. దీని కోసం అవసరమయ్యే కార్యాచరణను పకడ్బందీగా చేపట్టింది. ఈ నిర్ణయంతో కొయ్యబొమ్మల కళాకారుల ఉపాధికి భరోసా లభించినైట్లెంది.
ప్రయోగాత్మకంగా 5 పంచాయతీల ఎంపిక…
కాగా పొనికి మొక్కల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా 5 గ్రామపంచాయతీలను ఎంపిక చేశారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా మామడ మండలంలోని కొరిటికల్, గాయిద్పెల్లి, వాస్తాపూర్, లింగాపూర్, తోటిగూడ గ్రామాలు ఈ పొనికి మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే ఇక్కడి అటవీ ప్రాంతాల్లోని మట్టిని భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్షించారు. ఈ కేంద్రాల నుంచి అనుకూల రిపోర్టులు రావడంతో ఇక మొక్కల పెంపకానికి సంబంధించిన టార్గెట్‌ను ఖరారు చేశారు. మొదట లింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో హరితహారం కింద వెయ్యి పొనికి మొక్కలను నాటనున్నారు. అలాగే వాస్తాపూర్, గాయిద్పెల్లి తదితర గ్రామాల్లో దశలవారీగా మొక్కల పెంపకాన్ని చేపట్టబోతున్నారు. కాగా పొనికి మొక్కల పెంపకం విషయంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోనున్నారు. టిష్యూ కల్చర్ ఆధారంగా ఇక్కడి నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను ప్లాంటేషన్ చేయనున్నారు. ముఖ్యంగా పొనికి చెట్ల పెంపకానికి మామడ మండలంలోని గుట్ట ప్రాంతాల అటవీ భూములు అనుకూలమైనవని శాస్త్రీయంగా నిరూపించబడడంతో సంబంధిత అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
పొనికి కర్ర కొరతతో ఇబ్బంది పడుతున్నం…
ఐదారేళ్లుగా పొనికి కర్ర దొరకడం లేదు. కొయ్యబొమ్మలు తయారు చేయాలంటే పొనికి కర్ర కావాల్సిందే. కలప కొరతతో బొమ్మలు తయారు చేయలేకపోతున్నం. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద పొనికి చెట్లను పెంచాలని నిర్ణయించడం శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఈ కళ భావితరాలకు వెళ్లాలంటే పొనికి చెట్లను బాగా పెంచాలి. అటవీ అనుమతులను కూడా సులభతరం చేయాలి. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలతో పాటు కవులు, కళాకారులకు మేలు జరుగుతున్నది.
-డీ.పురుషోత్తం, కొయ్యబొమ్మల కళాకారుడు, నిర్మల్
పొనికి కలప ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం…
ప్రతి యేడు మాదిరిగానే ఈ సారి చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో పొనికి మొక్కల ప్లాంటేషన్‌కు ప్రాధాన్యమివ్వనున్నాం. నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమ ఉనికిని కాపాడాలన్న ఆశయంతో పాటు కళాకారులకు ఉపాధి కొనసాగించాలన్న సదుద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కొంత కాలంగా పొనికి కర్రకు తీవ్రమైన కొరత ఏర్పడిన విషయాన్ని గుర్తించాం. జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో ఈ మొక్కల ప్లాంటేషన్‌ను పకడ్బందీగా చేపడుతాం. మామడ మండలంలోని 5 పంచాయతీల్లో గల నర్సరీల్లో 5వేల మొక్కలు పెరుగుతున్నయ్.
-కే.విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, నిర్మల్