నిర్మల్ అర్బన్, అక్టోబర్ 8 ః ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభివన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొనుగోళ్లు, కేంద్రాల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దొడ్డు, సన్నరకం కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. మిల్లింగ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా సన్న, దొడ్డు రకం ధాన్యం బస్తాలను వేర్వేరు మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోళ్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం అక్రమ రవాణా జరుగకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్వో కిరణ్‌కుమార్, డీఎం వేణుగోపాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజీప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ పాల్గొన్నారు.