లక్షెట్టిపేట, జనవరి 20: ప్రతి విద్యార్థీ లక్ష్యంతో పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని లక్షెట్టిపేట ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శనివారం విద్యార్థులకు కేరీర్ గైడెన్స్‌పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కవిత, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఏఎస్ఐ రాములు, పాఠశాల, కళాశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 20 : కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు ఎంపీడీవో భాస్కర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని, మంచి ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారిణి హరిత, ఏవో మహేందర్, పీహెచ్సీ వైద్యులు సత్యనారాయణ, పశువైద్యాధికారి పవన్‌కుమార్, ఏఎస్ఐ కాంతారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలోని పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో బాలికా సాధికారత, బాలిల చదువు, బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 20 : ప్రతి ఒక్కరూ విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణంలోని రాజీవ్ నగర్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో కేరీర్ గైడెన్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ‘జీవన ప్రగతి మార్గదర్శక’ అంశంపై మాట్లాడారు. విద్యార్థినులు వివిధ ఉన్నత స్థాయి హోదాలు, వృత్తులు, స్థిరపడే విధంగా ఎలా చదవాలి, ఏమేం చదవాలి అనే విషయాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ మధూకర్, సబ్ యూనిట్ అధికారి గుండేటి నాందేవ్, మున్సిపల్ టీపీఎస్ శ్యామ్‌సుందర్, పర్యావరణ ఇంజినీర్ నాగరాజు, కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, జనవరి20: దండేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో శనివారం కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మల్లేశ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థులకు పదో తరగతి కీలకమైన దశ అని, ఇక్కడ నుండే ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సతీశ్‌కుమార్, మండల వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్, పశువైద్యాధికారి ధన్‌రాజ్, పీఆర్ఏఈ విక్రమ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణి, జీపీ కార్యదర్శి పృథ్వీరాజ్, విద్యాలయ ప్రత్యేకాధికారి మంజుల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని దండేపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం బీసగాని శంకర్‌గౌడ్ అన్నారు. దండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్నందున పదవతరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఎనగందుల సత్యం, సీఆర్పీ గరిగె నర్సయ్య, ఉపాధ్యాయులున్నారు.
భీమారం, జనవరి 20 : మండల కేంద్రంలోని గాంధీ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 8, 9, 10 విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళిక, సోపనాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పూర్వ విద్యార్థిని భీమారానికి చెందిన బీ మంజుల సాధించిన ప్రగతిని గుర్తించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ భూమన్న, పశువైద్యాధికారి రాకేశ్ శర్మ, పీఆర్‌జేఈ రవి , పోలీస్ సిబ్బంది ఆసంపల్లి కిరణ్, ప్రత్యేక అధికారిని కనకలక్ష్మి తదితరులున్నారు.
కన్నెపల్లి, జనవరి 20 : విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్ధాయికి చేరుకోవాలని తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, ఎంపీడీవో రాధాకిషన్ పేర్కొన్నారు. శనివారం కన్నెపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో కేరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించి పరీక్షలపై పలు సూచనలు చేశారు.
జన్నారం, జనవరి 20 : పిల్లలు వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఎంపీడీవో అరుణారాణి సూచించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో కేజీబీవీ విద్యాలయంలోని పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అఫీసర్ శ్రీవాణి, ఎంఈవో విజయ్‌కుమార్, డాక్టర్ ఉమశ్రీ, ఎఫ్ఎస్వో కిరాణ్మయిజ్యోతి, ఎంపీవో రమేశ్, ఏఎస్ఐ మృత్యుంజయ సర్కార్ పాల్గొన్నారు.