చెన్నూర్, నవంబర్ 12: చెన్నూర్ నియోజకవర్గంలో అక్రమాలకు తావు లేదని పేర్కొన్న మంత్రి వివేక్‌వెంకటస్వామి అక్రమార్కులకే అండదండలు అందిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్ ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియోతో పోస్టు వైరల్ అయింది. మంత్రి వివేక్ బుధవారం తన ముఖ్య అనుచరుడు గొడిశెల బాపురెడ్డికి చెందిన (జీఆర్ఆర్) పత్తి మిల్లులో సీసీఐ ద్వా రా పత్తి కొనుగోళ్లను ప్రారంభించారన్నారు. ఆదివార్పేట శివారులోని చెరువులో 2.35 ఎకరాల శిఖం భూమిని ఆక్రమించి బాపురెడ్డి ఆ మిల్లును కట్టాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి తేల్చినట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయని తెలిపారు. కబ్జా చేసి నిర్మించినట్లు ఆరోపణలున్న పత్తి మిల్లులో యజమానితో కలిసి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడంపై మంత్రి వివేక్‌ను ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసిన అసలైన పార్టీ కార్యకర్తలను పక్కకు పెట్టి, అక్రమార్కులను తన పక్కకు పెట్టుకుంటున్నావన్నారు. గతంలో చెన్నూర్ సమీపంలోని శనగకుంట మత్తడి పేల్చిన కేసులో అమాయకులను జైలుకు పంపించి, అసలైన నిందితులను కాపాడారని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి అధికారులతో సర్వే చేయించి ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమిని స్వాధీనం చేసుకోవాలని, చెరువును కబ్జా చేసిన బాపురెడ్డిపై చర్యలు తీసుకొని పత్తి మిల్లును కూల్చివేసి నిజాయితీని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని అనిల్ పేర్కొన్నాడు.