నేరడిగొండ, అక్టోబర్ 16 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ, నియోజకవర్గ ఇన్చార్జి గొడం నగేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలోని సూర్యగార్డెన్లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ మ్యానిఫెస్టోను చూసి ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో పదేండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలించి దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు దేశానికి అప్పుల భారం పట్టి పీడిస్తోందన్నారు. మండల నాయకులు, కార్యకర్తలు యువ నాయకుడు జాదవ్ అనిల్‌ను భారీ మెజారిటీ కట్టబెట్టాలన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్అనిల్ మాట్లాడుతూ.. మీ ఇంటి బిడ్డను, మీ వాడిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మనపై పెద్ద బాధ్యత పెట్టినాడు. అందుకే మీరందరూ నన్ను గెలిపిస్తే కడుపులో పెట్టి చూసుకుంటానని అన్నారు. మీరు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, ఈ అవకాశాన్ని మనందరం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు వస్తారు వారిని నమ్మవద్దని చెప్పారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ రాథోడ్ సజన్, నిమ్మల ప్రీతం రెడ్డి, మంజుల, జడ్పీటీసీలు రాజు, సుధాకర్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంట వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సాబ్లె కిశోర్‌సింగ్, మందుల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
అనిల్ జాదవ్‌కు మద్దతు
నేరడిగొండ, అక్టోబర్ 16 : బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను ఆదిలాబాద్ జిల్లా జై ఆదివాసీ యువ శక్తి సంఘం జిల్లా సభ్యులు సోమవారం నేరడిగొండలోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా జాదవ్ అనిల్‌కు బలపరుస్తూ మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఇందులో జై ఆదివాసీ యువశక్తి జిల్లా అధ్యక్షుడు జి బిపిన్‌కుమార్, ఉపాధ్యక్షుడు ప్రకాశ్ కుమార్, తొడసం శంకర్, సభ్యులు మెస్రం ప్రకాశ్, నైతం గణేశ్‌లు కలిసిన వారిలో ఉన్నారు.