అష్ట కష్టాలు పడి సాగు చేసిన సోయా పంటను అమ్ముదామంటే రైతులకు తిప్పలు తప్పడం లేదు. బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడితేనే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతుండడంతో మార్కెట్లో రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఆదిలాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజులు ఆలస్యంగా సోయా కొనుగోళ్లు ప్రారంభం కాగా రైతులు పంటను మార్కెట్ యార్డులకు తీసుకువస్తున్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో సోయాబిన్‌ను మద్దతు ధర క్వింటాలుకు రూ.5328తో కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా, పంటలో చెత్త, వ్యర్థాలు లేకుండా సోయాబిన్‌ను విక్రయించేందుకు రైతులు మార్కెట్ యార్డులకు తీసుకువస్తున్నారు. పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా షెడ్యూల్ ప్రకటించి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా మార్కెట్ యార్డుల్లో రైతులు పంటను విక్రయించేందుకు బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు రాక తిప్పలు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ చేసి రైతులు ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ పద్ధతిలో పంటను సేకరిస్తున్నారు. రైతులు పంట విక్రయంలో భాగంగా బార్కోడ్ జారీ చేస్తారు. ఇందుకోసం వేలిముద్ర వేయాల్సి వస్తుంది. పంటను కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ అధికారులు సంచులు ఇస్తుండగా అప్పుడు ఒకసారి, పంట విక్రయించేటప్పుడు వివరాలు నమోదు చేసేటప్పుడు మరో సారి రెండు సార్లు రైతులు వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. కొంత మంది రైతుల వేలిముద్రలు పడకపోవడంతో వారు సోయాను అమ్ముకునే అవకాశం లేకుండా పోతున్నది. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తుండగా ఓటీపీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఈ విధానం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సోయా కొనుగోళ్లలో లేకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆన్లైన్ విధానంలో కొనుగోళ్లు జరుగుతుండడంతో వేలిముద్ర పడకపోతే తాము ఏమీ చేయలేమని అధికారులు అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక రైతులు పంటను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు.
మార్క్‌ఫెడ్ వాళ్లు ఆన్లైన్లో పంటను కొంటున్నరు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని కారణంగా పంటను విక్రయించేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడడం లేదని పీఏసీఎస్ సిబ్బంది పంటను కొంటలేరు. ఈ విషయంలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులకు చెప్పినా మా చేతిలో ఏమీ లేదంటున్నారు. దీంతో పంటను ప్రైవేట్ వ్యాపారులకు రూ.4300 అమ్ముతూ క్వింటాలుకు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారు. వేలిముద్ర విషయంలో అధికారులు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలి.
– పద్మాకర్ రెడ్డి, రైతు, తలమడుగు