కాసిపేట, సెప్టెంబర్ 4: సింగరేణి మందమర్రి ఏరియాలోని సోమగూడెం భరత్ కాలనీ చౌరస్తాలో రజకుడిపై సింగరేణి ఎస్అండ్ పీసీ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించారు. కంచర్ల రాజమల్లు (Kancharla Rajamallu) అనే వ్యక్తి కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. అతడికి సోమగూడెం చౌరస్తాలో తడకలతో నిర్మించిన షెడ్డు ఉండగా.. ఇటీవలే దానిని రేకులతో తాత్కాలిక షెడ్డుగా నిర్మించే పనులు చేపట్టాడు. అయితే.. సింగరేణి ఎస్ అండ్ పీసీ సిబ్బంది వచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దంటూ రాజమల్లు షెడ్డును ధ్వంసం చేశారు.
‘కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నానని. నా పొట్ట కొట్టవద్ద’ని వేడకున్నా సిబ్బంది కనికరించలేదు. దాంతో.. బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. పేదవాడైనా అతడిపై ప్రతాపం చూపించిన అధికారులు.. చుట్టు పక్కల అక్రమంగా పెద్ద కట్టడాలు కట్టినా మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. 30 ఏళ్ల నుంచి ఆ చిన్నపాటి లాండ్రీ షాప్పైనే ఆధారపడి జీవిస్తున్న రాజమల్లు షెడ్డును కూల్చివేయడాన్ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యాక్షులు చందర్ ఖండించారు. సింగరేణి యాజమాన్యం వైఖరిని తప్పుపట్టిన ఆయన రాజమల్లుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రజకులంతా ఆందోళన బాట పడుతామని ఆయన హెచ్చరించారు.