తాండూర్ : ప్రతి యేటా మార్చినెలాఖరు వరకు చేపట్టే ఇంటి పన్నుల వసూళ్లలో (Tax Collection ) వేగం పెంచేందుకు అధికారులు వినూత్నతరహాలో ప్రచారం(Innovative Campaign) చేస్తున్నారు. ఇందులో భాగంగా తాండూర్ మండలంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో శ్రీనివాస్ , పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ డప్పు చాటింపు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి సిబ్బంది బకాయిలు వసూలు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెండింగ్ బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మార్చి నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేస్తామని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు.
ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. తాండూర్ (Tandoor) గ్రామపంచాయతీ పరిధిలో ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి పన్ను వసూలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటివరకు 48 శాతం ఇంటి పన్నులు వసూలు అయ్యాయని, మార్చి చివరి నాటికి వందశాతం లక్ష్యసాధన దిశగా సిబ్బందితో కలిసి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో దొండ దివాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.