ఏజెన్సీ ప్రాంతమైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపై చలి పంజా విసరగా, ప్రజానీకం గజగజ వణికిపోతున్నది. మబ్బులు పడి కొన్ని రోజుల పాటు కాస్త చలి తగ్గినా, గత నాలుగైదు రోజుల నుంచి విజృంభిస్తున్నది. సాయంత్రం ఆరింటిలోపే ప్రజలు ఇళ్లకు చేరుకుంటుండగా, రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక ఉదయం 8 గంటలు దాటాక కూడా పొగమంచు తొలగడం లేదు.
కొందరు వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్లడ్ లైట్లు వేసుకొని ప్రయాణిస్తుండగా, మరికొందరు సూర్యుడు ఉదయించిన తర్వాతే ముందుకు సాగుతున్నారు. శుక్రవారం సిర్పూర్(యు)లో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, గడ్డకట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఎక్కడ చూసినా చిన్నా.. పెద్దలంతా చలిమంటలు కాగుతూ కనిపించారు. కాగా, మున్ముందు మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైబయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
– సిర్పూర్(యూ)/కెరమెరి, జనవరి 3