నిర్మల్, జూన్ 25(నమస్తే తెలంగాణ) : ఇటీవలి కాలంలో కాసుల కోసం కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలు శృతి మించుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ నగరాలకు చెందిన కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు పల్లెల్లోనూ పర్యటిస్తున్నారు. స్థానికంగా కొంతమంది ప్రైవేటు డాక్టర్లను తమ బుట్టలో వేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల సర్వే ప్రకారం నిర్మల్ ప్రాంతం అత్యంత ప్రొటెన్షియల్ ఏరియాగా గుర్తించబడిన కారణంగానే ఈ హాస్పిటళ్లు తమ వైద్య వ్యాపారాన్ని లాభాలమయంగా మార్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి.
ఇందులో భాగంగానే వారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పేరిట మోడరన్ దళారులను రంగంలోకి దించాయని తెలుస్తున్నది. హైదరాబాద్‌లోని పలు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ప్రైవేటు ఆసుపత్రులు కొన్నేళ్లుగా తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో విస్తృతంగా పర్యటింప జేస్తున్నాయి. ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పట్టణ ప్రాంతాల్లోని కొంతమంది ప్రైవేటు డాక్టర్లను, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులకు అవసరమున్నా, లేకపోయినా హైదరాబాద్‌లోని తమకు కాంటాక్టులో ఉన్న కార్పొరేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ రకాల చికిత్సల కోసం తమ వద్దకు వచ్చే రోగులను మొదట వీరి దవాఖానలో ఒకటి, రెండు రోజులు జాయిన్ చేసుకుని ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం అదనపు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలంటూ సూచనల రూపంలో హెచ్చరికలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఇలా రెఫర్ చేసిన వారికి హైదరాబాద్‌లోని హాస్పిటళ్లు భారీగా కమీషన్లు చెల్లిస్తున్నాయి. అలాగే తమ వద్ద చికిత్సలు పొందే రోగుల నుంచి ఈ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల రూపాయల్లో బిల్లులు గుంజుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి ప్రైవేటు డాక్టర్లు తమ పాచిక పారాలంటే అమాయక రోగులనే ఎక్కువగా లక్ష్యం చేసుకుంటున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మంచి వైద్యం అందాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందేనంటూ.. లేకుంటే ప్రాణాపాయం తప్పదన్న భయాన్ని సృష్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ప్రైవేటు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ పల్లెల్లో తిరుగుతూ తాము చెప్పిన ఆసుపత్రులకు రెఫర్ చేస్తే తామిచ్చే కమీషన్లు, నజరానాలు, బహుమతుల గురించి కొందరు ఆర్ఎంపీలకు ఆశ చూపుతూ తమవైపు తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా కమీషన్లకు ఆశ పడుతున్న ప్రైవేటు వైద్యులు తమ నైతిక విలువలు, బాధ్యతలను పక్కన పెట్టి అమాయ క రోగులను బలిపశువులు చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నా యి. గతేడాది వానకాలంలో జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెం గీ, మలేరియా వంటి లక్షణాలతో రోగులు వేల సం ఖ్యలో మంచం పట్టారు.
ప్రభుత్వ ద వాఖానలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసి పోయాయి. దీనిని అదనుగా చేసుకున్న కార్పొరేట్ హాస్పిటళ్లు తమ ఎగ్జిక్యూటివ్‌లను రంగంలోకి దించి స్థానికంగా గల కొంతమంది ప్రైవేటు డాక్టర్లకు కమీషన్లు, ప్యాకేజీలు, బహుమతుల పేరిట ఆశ చూపిన ట్లు తెలిసింది. దీంతో ఇక్కడి కొంతమంది ప్రై వేటు డాక్టర్లు డెంగీ జ్వరం వచ్చిందని, ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయంటూ రోగులను భయపెట్టి కా ర్పొరేట్ ఆసుపత్రులు ఇచ్చే భారీ కమీషన్లకు ఆశప డి హైదరాబాద్ రెఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది.
భారీగా కమీషన్లు, టూర్ ప్యాకేజీలు
కార్పొరేట్ హాస్పిటల్స్ తమ వద్దకు రోగులను రెఫర్ చేసే ప్రైవేటు వైద్యులకు పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లిస్తున్నాయి. ఇలా ఓ వైపు కమీషన్లు చెల్లిస్తూనే అనుకున్న టార్గెట్ పూర్తి చేసిన డాక్టర్లకు ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నా యి. ఈ ప్యాకేజీలో భాగంగా గోవా, ఊటీ, బెంగళూర్, చెన్నై తదితర నగరాల్లో వీరికి టూర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆయా నగరాల్లోని రీసార్ట్స్లో సకల సదుపాయాలను ఏర్పాటు చేసి వారిని ఆనందింపజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తమకు సహకరించేలా కార్పొరేట్ యాజమాన్యాలు ముందు చూపు తో వ్యవహరిస్తున్నాయి. మరికొంత మంది వైద్యులకు వారు ఇచ్చిన రెఫర్ స్థాయిని బట్టి విదేశీ టూర్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి నజరానాలకు ఆశపడుతున్న కొంతమంది ప్రైవేటు వైద్యులు తమ మానవీయ ధర్మాన్ని పక్కన పెట్టి అమాయక రోగులను ఆర్థికంగా అవస్థలపాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
కమీషన్ల కోసం అమాయక రోగులను హైదరాబాద్‌కు రెఫర్ చేయడం సమంజసం కాదు. ఈ విషయమై తమకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాల వైద్య చికిత్సలను అందిస్తున్నాం. అత్యవసర శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలి.