నార్నూర్,జనవరి11:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)తండాలోని జాతీయ దీక్షభూమి భక్తులతో కిటకిటలాడింది. బుధవారం గురు,శిష్యుల(మిలాన్ దివస్) 44వ గురుకృప దివస్‌ను దీక్ష గురు ప్రేమ్‌సింగ్ మహారాజ్ అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవీ, రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వీ రాంరావ్ మహారాజ్‌కు పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భజనలు,కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు గంగాపూర్ నుంచి శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ పల్లకీతో పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. దీక్షగురువు ప్రేమ్‌సింగ్ మహారాజ్ బోగ్‌భండార్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు దర్వనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కొనేరు కొనప్ప, రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ నాయక్, ఉమ్మడి జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, సర్పంచ్ రాథోడ్ సుభద్రాబాయి, రామేశ్వర్, ఆయా సంఘాల నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.