బజార్హత్నూర్, మే 12 : జాతర్ల గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అర్క మేఘనాథ్ జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి జాతర్ల గ్రామం వరకు యువకులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీగా గ్రామానికి చేరుకున్నారు.
దీంతో విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముందుగా మేఘనాథ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జవాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ లాంచనాలతో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ వినయ్‌రెడ్డి జవాన్ భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి గౌరవ వందనం చేశారు. గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి దహన సంస్కారాలు నిర్వహించారు.